రీజనల్ రింగు రైలుకు డీపీఆర్!
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:52 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగు రైలు ప్రాజెక్టులో ముందడుగు పడింది. రీజనల్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ రైలు మార్గానికి సంబంధించి ...
ఏప్రిల్ నాటికి సిద్ధం చేసి, కేంద్రానికి అందించేందుకు కసరత్తు
45 మీటర్ల దూరంలో రైలు మార్గం నిర్మించేలా ప్రతిపాదన
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగు రైలు ప్రాజెక్టులో ముందడుగు పడింది. రీజనల్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ రైలు మార్గానికి సంబంధించి ‘సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)’ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నాటికి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు సర్వే ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. బుధవారం రీజనల్ రింగు రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ, రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ప్రాజెక్టు సర్వే పనులను సమీక్షించడంతోపాటు డీపీఆర్ రూపకల్పనపై ఈ భేటీలో చర్చించారు. వాస్తవంగా రీజనల్ రింగు రైలు ప్రతిపాదిత మార్గం మొదట్లో రీజనల్ రింగు రోడ్డుకు సుమారు 10, 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది. రెండు మార్గాలు సమాంతరంగా ఉన్నా, వాటి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో రెండు చోట్లా భూసేకరణ, ఇతర సమస్యలు తలెత్తుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. సీఎం రేవంత్ ఈ అంశాన్ని కేంద్రానికి వివరించారు. దీనికి కేంద్రం అంగీకరించింది. దీని ప్రకారం రీజనల్ రింగు రోడ్డు పక్కనే 45 మీటర్ల దూరంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు సర్వే కూడా తుది దశకు వచ్చింది. రింగు రైలు 362 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 19 స్టేషన్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. డీపీఆర్ సిద్ధమైతే ప్రాజెక్టు వివరాలపై స్పష్టత రానుంది.