Share News

సొంతింటి కలకు ఇదే సమయం

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:18 AM

ప్రజలు తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జగన్నాథరావు అన్నారు.

సొంతింటి కలకు ఇదే సమయం

  • ఇళ్లు, ఫ్లాట్ల ధరలు ఎప్పటికీ తగ్గవు.. మున్ముందు తగ్గుతాయనుకోవటం అపోహే

  • హైదరాబాద్‌ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌

  • కొవిడ్‌ తర్వాత పెరిగింది ఫ్లాట్ల విస్తీర్ణమే.. ధరలు కాదు

  • భారీ ఫ్లాట్లకు డిమాండ్‌ పెరుగుతోంది

  • క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జగన్నాథరావు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జగన్నాథరావు అన్నారు. ఇళ్లు, ఫ్లాట్లధరలు ఎప్పుడూ తగ్గవని, ఇంకొంతకాలం ఆగితే ధర తగ్గుతుందనేది అపోహ మాత్రమేనని తెలిపారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీషో సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఎలా ఉంది?

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ప్రస్తుతం బాగుంది. ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గానే ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్నదంతా దుష్ప్రచారమే. కొవిడ్‌-19 సమయంలో ప్రపంచమంతా స్తంభించిన్నట్లుగానే.. మన దగ్గర కూడా జరిగింది. కానీ.. ఇళ్లు, ఫ్లాట్లు కొనేవారు కొంటున్నారు. అమ్మేవారు అమ్ముతున్నారు. రిజిస్ర్టేషన్ల ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేయలేం.

ఇళ్లు, ఫ్లాట్ల ధరలు తగ్గే అవకాశం ఉందా?

ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరుగుతుంటాయి కానీ.. ఎప్పుడూ తగ్గవు. ఇవి ఆస్తులు. ఎవ్వరైనా వాటిని అమ్ముకుంటే ఎక్కువ ధర రావాలని చూసుకుంటారు తప్ప.. తక్కువకు విక్రయిస్తారా? డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కూడా ధరలను ఏవిధంగా తగ్గిస్తాయి? హైదరాబాద్‌లో స్థలాల ధరలు ఎక్కువ.. ఇక నిర్మాణ వ్యయం పెరిగింది. ప్రభుత్వానికి నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించాల్సిందే. ఎక్కడ కూడా డెవలపర్‌కు తక్కువ ధరకు రావడం లేదు కదా! అలాంటప్పుడు తక్కువ ధరకు అమ్ముకోరు కదా!

ఏ నగరంతోనైనా హైదరాబాద్‌కు పోటీ ఉందా?

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ దేశంలో అగ్రగామిగా ఉంటూ పుణెతో పోటీపడుతోంది. పుణె రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు, హైదరాబాద్‌కు చాలా దగ్గరి సంబంధంఉంది. చాలావరకు అక్కడి నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌కు కూడా వస్తున్నాయి.

ప్రాపర్టీ షోకు ఎలాంటి స్పందన వస్తోంది?

గతంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో ఏడాదికి ఒకటే జరిగేది. కొన్నేళ్లుగా ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాం. శుక్రవారం హైటెక్స్‌లో ప్రారంభమైన ప్రాపర్టీ షోకు అనూహ్యస్పందన వస్తోంది. వేలాది మంది సందర్శిస్తున్నారు. సైట్‌ విజిట్లు చేస్తామంటున్నారు. క్రెడాయ్‌ ప్రాపర్టీ షో రియల్‌ ఎస్టేట్‌కు ఒక బూస్ట్‌ లాంటిది.


హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగాయా? స్థిరంగా కొనసాగుతున్నాయా?

హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగాయనేది నిజం కాదు. ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కో రకమైన ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కాప్రా ప్రాంతంలో ఓ నిర్మాణ సంస్థ రూ.33 లక్షలకు కూడా ఫ్లాట్‌ను అందుబాటులో ఉంచింది. విస్తీర్ణం ఆధారంగానే ఫ్లాట్ల ధరలు పెరిగాయి. కోకాపేటలో ఓ నిర్మాణ సంస్థ ఫ్లాట్‌ ధర రూ.3 కోట్లు అనగానే.. చదరపు అడుగు ఎంతో అనుకుంటారు. కానీ, అక్కడ ఫ్లాట్‌ విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభమవుతుంది. చదరపు అడుగుకు రూ.5 వేలు అయినా రూ.3 కోట్లు అవుతుంది. లగ్జరీ సెగ్మెంట్‌లో కానీ, సాధారణంగా కానీ ఫ్లాట్‌ ధరలు భారీగా పెరగలేదు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లకు డిమాండ్‌ ఎలా ఉంది?

గతంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల కోసం వెతికేవారు. ప్రస్తుతం ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌, అంతకంటే పెద్దవాటికి డిమాండ్‌ పెరిగింది. అలాంటి ప్రాజెక్టులు నగరంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. కోవిడ్‌-19 తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్లాట్ల విస్తీర్ణం పెరిగింది. ఫ్లాట్లలో ఉండాల్సిన సౌకర్యాలపై కొనుగోలుదారులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగానే ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రపంచానికి రోల్‌ మోడల్‌గా ఉండే ఫ్లాట్స్‌ కూడా హైదరాబాద్‌లో వస్తున్నాయి. ఓ నిర్మాణ సంస్థ 16 వేల చదరపు అడుగులతో ఒక ఫ్లాట్‌ తీసుకొస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Feb 08 , 2026 | 06:19 AM