Share News

రాయదుర్గం.. పాట మళ్లీ అదిరె!

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:34 AM

తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన రెండు పాటల ద్వారా రూ.2529 కోట్లు సమీకరించింది.

రాయదుర్గం.. పాట మళ్లీ అదిరె!

  • రెండోసారి 5.09 ఎకరాలకు వేలం

  • 204 కోట్ల ధర చొప్పున 1038 కోట్లు

  • 2 వేలం పాటల్లో 11.38 ఎకరాల విక్రయం

  • టీజీఐఐసీకి 2,529 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్ర జ్యోతి): తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన రెండు పాటల ద్వారా రూ.2529 కోట్లు సమీకరించింది. మొత్తంగా 11.38 ఎకరాలను విక్రయించడం ద్వారా ప్రీమియం కారిడార్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ఈ భూములకు వేలంలో అత్యంత ఖరీదు పలకడంతో దేశంలోనే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ తన సత్తాను చాటిచెప్పినట్లయింది. తొలి ఈ- వేలం పాటను 6.29 ఎకరాలకు నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఎకరాకు రూ.237 కోట్ల ధర చొప్పున మొత్తంగా రూ.1490కోట్ల ఆదాయం లభించింది. రెండో ఈ-వేలం పాటను 5.09 ఎకరాలకు నిర్వహించగా ఎకరాకు రూ.204 కోట్ల ధర చొప్పున మొత్తంగా రూ.1038.36 కోట్ల ఆదాయం లభించింది. టీజీఐఐసీ రిజర్వ్‌ ధరతో పోల్చితే ఇది 46.8 శాతం అదనం అని టీజీఐఐసీ పేర్కొంది. రెండు వేలంపాటల ద్వారా సగటున ఎకరాకు రూ.222 కోట్లు పలికిందని టీజీఐఐసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది ప్రాథమిక ధరతో పోల్చితే 60 శాతం పెరుగుదల అని తెలిపింది. 2025లో నిర్వహించిన వేలంలో పలికిన రూ.156 కోట్ల సగటు (ఎకరాకు) ధరతో పోలిస్తే ఇది 42 శాతం అదనం అని పేర్కొంది. రియల్టర్లు అత్యధిక ధరలు పెట్టేందుకు పోటీ పడుతుండటంతో హైదరాబాద్‌లోని వ్యూహాత్మక కారిడార్లలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఈ రెండు వేలం పాటలను ఎంఎస్‌టీఎస్‌ వేదికగా నిర్వహించగా, జేఎల్‌ఎల్‌ ప్రత్యేక లావాదేవీల సలహాదారుగా వ్యవహరించినట్లు టీజీఐఐసీ తెలిపింది. ఈ విషయంపై టీజీ ఐఐసీ ఎండీ కె.శశాంక మాట్లాడుతూ రాయదుర్గం భూముల వేలంలో అత్యధిక ధరలు పలకడం అనేది భవిష్యత్తుపై రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేసిందన్నారు. ఈ భూముల వేలం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రంగా నిలిపాయన్నారు. పెట్టుబడులకు పారదర్శకమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబులకు టీజీఐఐసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన కోసం టీజీఐఐసీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - Jun 02 , 2026 | 04:34 AM