పదేళ్లుగా.. ఎక్కడి కేసు అక్కడే!
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:50 AM
రాష్ట్ర రాజధానిలో పదేళ్ల కిందట.. 2016 జూలై 1న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కుర్రాళ్ల నిర్లక్ష్యంతో చిన్నారి సహా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
రమ్య కుటుంబానికి న్యాయం జరిగేదెన్నడు?
కోర్టులో కేసు విచారణ జరిగింది ఒక్కసారే!
పంజాగుట్ట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రమ్య, ఆమె తాత, బాబాయి
విచారణలో సుదీర్ఘ జాప్యం.. అమెరికాలో ఏ2
అతనికి రెడ్‌కార్నర్ నోటీసుల జారీలో జాప్యం
తాగి కారు నడిపి.. ముగ్గుర్ని బలిగొన్నవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు
నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడిపైనా చర్యలు తీసుకోలేదు
ఏ తప్పూ చేయని మాకు ఎందుకు ఈ శిక్ష?
రమ్య కుటుంబ సభ్యుల ఆవేదన
హైదరాబాద్/సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో పదేళ్ల కిందట.. 2016 జూలై 1న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కుర్రాళ్ల నిర్లక్ష్యంతో చిన్నారి సహా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాలుగు కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. పంజాగుట్ట కారు ప్రమాదం అనగానే చిన్నారి రమ్య రూపం కళ్లముందు కదులుతుంది. పాపతోపాటు ఆమె తాత, బాబాయి మృత్యువాత పడ్డారు. మద్యం సేవించి ఓ కుర్రాడు కారు నడపడంతో అది అదుపు తప్పి, మరో కారుపై పడి.. నాలుగు కుటుంబాలను ఛిద్రం చేసింది. ఇద్దరు కుర్రాళ్ల సరదాలకు ముగ్గురి ప్రాణాలు పోయాయి. ‘‘పీకలదాకా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఏ1, ఏ2 నిందితులు హాయిగా బయట తిరుగుతున్నారు. నిబంధనలు పాటించకుండా మైనర్లకు మద్యం అమ్మిన టీజీఐ ఫ్రైడేస్ బార్ మళ్లీ తెరుచుకుంది. మేం మాత్రం ఆప్తులను కోల్పోయి నిత్యం నరకం చూస్తున్నాం. న్యాయం కోసం పోరాడి అలసిపోయాం’’ అని రమ్య నాన్న పమ్మి వెంకట రమణ కన్నీటి పర్యంతమయ్యారు. రమ్య మృతి కేసులో పదేళ్లలో ఒక్కసారి మాత్రమే కోర్టులో విచారణ జరిగిందని వాపోయారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోందన్నారు. ఎందుకింత జాప్యం అని ఆరా తీస్తే.. నిందితుల్లో ఒకరిది పోలీసు, న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేయగలిగిన కుటుంబమని తెలిసిందని అన్నారు.
అమెరికా వెళ్లిపోయిన ఏ2
మద్యం సేవించి, కారు నడిపాడన్న ఆరోపణతో ఏ1గా విచారణ ఎదుర్కొంటున్న శ్రావిల్ కోర్టు వాయిదాలకు హాజరువుతున్నాడు. కారు యజమాని ఏ2 విష్ణు వినీత్ మాత్రం దేశం దాటి వెళ్లిపోయాడు. పాస్‌పోర్టు కార్యాలయాన్ని సంప్రదించగా.. అతను అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్నట్లు తెలిపారని వెంకట రమణ చెప్పారు. కేసు వాయిదాలు పడడానికి ప్రధాన కారణం ఏ2 పరారీలో ఉండడమేనని అన్నారు. విష్ణు మీద నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసిందన్నారు. అతనికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని రమ్య తల్లి ఆరోపించారు. ఏ2ను భారత్‌కు రప్పించగలిగితే విచారణ త్వరగా పూర్తవుతుంది. కానీ, అతని కుటుంబ సభ్యులకున్న పలుకుబడి కారణంగా అలాంటి ప్రయత్నాలేమీ జరగడం లేదని వాపోతున్నారు. ఏ2 తల్లిదండ్రులు, మేనమామ న్యాయవాదులు కావడంతో చట్టంలోని లోపాలను వారికి అనుగుణంగా మలుచుకుంటున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మారారని రమ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పదేళ్లలో పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను కలిసి కేసు పురోగతిపై విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదంటున్నారు. ప్రభుత్వం, అధికారులు మారినా తమకు మాత్రం న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బార్ యజమానిపైనా చర్యల్లేవు..
ప్రమాదానికి కారకులైన కుర్రాళ్లకు మద్యం అమ్మిన బంజారాహిల్స్‌లోని టీజీఐఎఫ్ బార్ నిర్వాహకుడిని ఏ3గా పేర్కొన్నారు. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. నిబంధనలను తుంగలో తొక్కి కుర్రాళ్లకు మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడికి కఠిన శిక్ష పడాలని వెంకటరమణ పెద్ద పోరాటమే చేశారు. ఇదే టీజీఐఎఫ్ అమెరికాలో నిబంధనలను అతిక్రమిస్తే కొన్ని మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించినట్లు ఆయన చెప్పారు. ఇక్కడ మాత్రం ఎక్సైజ్‌శాఖ రూ.లక్ష జరిమానా విధించిందని, ఆ మొత్తం చెల్లించిన నిర్వాహకులు.. ప్రమాదం జరిగి ఏడాది గడవకముందే బార్ తలుపులు బార్లా తెరిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని వెంకటరమణ ప్రశ్నించారు. మైనర్లకు మద్యం అమ్మిన బార్‌ను మూసేయాలని కోర్టులో కేసు వేసినా లాభం లేకపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.
అవమానాలే మిగిలాయి..
రమ్య బాబాయి రాజేశ్ మృతితో అతని భార్య శిల్ప, కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వారికి పరిహారం కూడా సరిగ్గా అందలేదు. బిడ్డను పోషించడానికైనా శిల్పకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని బాధితులు అప్పటి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రమాదం వల్ల తాకిన దెబ్బలకు రమ్య తల్లి, మరో బాబాయి రమేశ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. లోకాయుక్తను ఆశ్రయించిన సమయంలో భర్తను పోగొట్టుకున్న శిల్పకు ఉద్యోగం కల్పించాలని అడిగితే.. ‘యాచిస్తున్నారా’ అని మమ్మల్ని అవమానించారంటూ రమ్య తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
న్యాయం దక్కేదెప్పుడు?
ఏ2 పరారీలో ఉన్న కారణంగా విచారణను విడగొట్టి ఏ1కు సమన్లు జారీచేసినట్లు తెలిసింది. పరారీ లో ఉన్న విష్ణువినీత్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ చొరవ తీసుకోవాలని రమ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
‘రమ్య చట్టం’ చేయాలి
మా బంగారు తల్లి మాకు దూరమై పదేళ్లు. అదే ప్రమాదంలో మా నాన్న, నా చిన్న తమ్ముడు మరణించారు. వారిని తలుచుకొని ఏడవని రోజు లేదు. పోయిన మనుషులు ఎలాగూ తిరిగిరారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదనే పోరాడుతున్నాం. రమ్య చట్టం తీసుకొస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గత ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ, ఒక్కటీ నెరవేరలేదు. రమ్య చట్టం తీసుకురావాలి. మోటారు వాహన చట్టాన్ని సవరించి శిక్షలను కఠినతరం చేయాలి. డ్రంకెన్ డ్రైవ్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి.
- పమ్మి వెంకట రమణ, రమ్య తండ్రి
పరారీలోని నిందితుడి ఆస్తులు జప్తుచేయచ్చు
నిందితుడిని తప్పించేందుకు కేసు విచారణను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. పోలీసులు వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలి. నిందితుడు ఏ దేశంలో ఉన్నా రాయబార కార్యాలయం జోక్యంతో వెంటనే విచారణకు రప్పించాలి. లేకపోతే అతని ఆస్తులు జప్తుచేయాలి.
- ఇమ్మానేని రామారావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది