ఆస్తి విలువ ఆధారంగా పన్ను
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:28 AM
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూలధన విలువ ఆధారంగా ...
రిజిస్ట్రేషన్ విలువను అనుసరించి స్థలాలు, భవనాల మూలధన విలువ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో అమలు
పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా పన్ను పెరిగే అవకాశం
3 కార్పొరేషన్లకు ఒకే చట్టం.. ‘క్యూర్ 2026’ ముసాయిదా
సుస్థిర పట్టణాభివృద్ధి, సమర్థ పాలన లక్ష్యంగా సంస్కరణలు
వ్యాపారాల కోసం ఒకే సమీకృత లైసెన్సు
అత్యవసర సేవలన్నింటికీ ఒకే ఆన్‌లైన్ పోర్టల్
సీఎం అధ్యక్షుడిగా క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్
నైట్ ఎకానమీ జోన్లు.. రాత్రంతా వాణిజ్య కేంద్రాలు ఓపెన్
జూలై 24 వరకు సూచనలు, అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూలధన విలువ ఆధారంగా ఆస్తిపన్ను వసూలు నుంచి ఏకీకృత వ్యవస్థలు కేంద్రంగా సులభతర పాలన వరకు కీలకమైన మార్పులెన్నో చేపట్టనుంది. ఇందుకోసం 71 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ-1955 చట్టం స్థానంలో మూడు కార్పొరేషన్ల (జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)కు కలిపి కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లు (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్)-2026ను ఆదివారం విడుదల చేసింది. పెరిగిన విస్తీర్ణం, జనాభా అవసరాలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా.. సమగ్ర, సమర్థవంతమైన, డిజిటల్ ఆధారిత నగర పాలనా వ్యవస్థగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఇక క్యూర్ పరిధిలో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కోసం సీఎం అధ్యక్షతన ప్రత్యేకంగా క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ముసాయిదా బిల్లులో 43 చాప్టర్లు, 9 షెడ్యూళ్లు ఉన్నాయి. ముసాయిదా బిల్లుపై పౌరులు, పట్టణాభివృద్ధి నిపుణులు, పరిశ్రమలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 24లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరింది. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ వెబ్‌సైట్లలో ఉన్న ముసాయిదా బిల్లును పరిశీలించవచ్చని తెలిపింది. క్యూర్ పరిధిలో ఆస్తి పన్ను మదింపులో కీలక సంస్కరణలను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్షిక అద్దె ఆధారంగా ఆస్తి పన్ను మదింపు జరుగుతోంది. అయితే ఇప్పుడు క్యూర్ పరిధి అంతటా మూలధన (కేపిటల్) విలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం తీసుకురానున్నారు. ఇందులో ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ ధరలను బట్టి స్థలం, భవన మూలధన విలువను లెక్కిస్తారు. నివాస కేటగిరీ నిర్మాణాలకు మూలధన విలువలో 0.10 శాతానికి తగ్గకుండా, 0.50 శాతానికి మించకుండా... నివాసేతర కేటగిరీలో 0.20 శాతానికి తగ్గకుండా, 2 శాతానికి మించకుండా వార్షిక ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. ఈ విధానం ప్రకారం పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇక ఆస్తి పన్ను స్వీయ మదింపునకూ అవకాశం ఉంటుంది. ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు కోడ్ (యూనిక్ కోడ్) కేటాయిస్తారు. ఆకా్ట్ట్రయ్, కుక్కల పన్ను రద్దు చేస్తారు. సకాలంలో పన్ను చెల్లించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.
సకాలంలో అనుమతివ్వకుంటే..
భవన నిర్మాణం, లే అవుట్ అనుమతుల జారీలోనూ నూతన నిబంధనలు అమలు కానున్నాయి. దరఖాస్తులపై నిర్దేశిత వ్యవధిలో అధికారి ఆమోదం/తిరస్కరణ నిర్ణయం తీసుకోకుంటే.. సదరు దరఖాస్తులు పైఅధికారికి బదిలీ అవుతాయి. అక్కడ కూడా గడువులోగా నిర్ణయం తీసుకోకుంటే.. ఆటోమేటిగ్గా దరఖాస్తుకు ఆమోదం పొందే (డీమ్డ్ టు బి అప్రూవల్) అవకాశం దరఖాస్తుదారులకు లభిస్తుంది. డీమ్డ్ టు బి అప్రూవల్ కోసం దరకాస్తుదారులు కమిషనర్‌కు ఏడు రోజుల గడువుతో నోటీసు ఇవ్వాలి. నిర్దేశిత సమయంలో కమిషనర్ స్పందించని పక్షంలో దరఖాస్తు ఆమోదం పొందినట్టుగా పరిగణించబడుతుంది. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ, నిషేధిత భూముల్లోని భవన నిర్మాణ దరఖాస్తులకు ఈ నిబంధన వర్తించదు.
అక్రమ నిర్మాణాలు చేపడితే సీజ్
క్యూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా పనులు చేపట్టినా, నిర్మాణం పూర్తయ్యే అవకాశముందని భావించినా, అందులో ఎవరైనా నివాసం ఉండే పరిస్థితి ఉన్నా.. కమిషనర్లు 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి సీజ్ చేయవచ్చు.ప్రజల భద్రతకు ఇబ్బందిగా ఉంటే లిఖిత పూర్వక కారణాలు తెలిపి, నోటీసులు లేకుండానే సీజ్ చేసే అవకాశమూ ఉంటుంది. ఇక నివాసయోగ్య పత్రం లేకుండా విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వద్దన్న నిబంధనను టీజీఎ్‌సపీడీసీఎల్, వాటర్‌బోర్డు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపడతారు. పారిశుధ్య నిర్వహణ, ఆరోగ్యానికి కొత్త చట్టంలో ప్రాధాన్యతనిచ్చారు. ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే ప్లాట్ మూలధన విలువలో 0.25శాతం మేర జరిమానా విధిస్తారు. చెత్త తొలగించే వరకు జరిమానాల విధింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి
కొత్త చట్టం ముసాయిదాలో ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)కు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టంలో ట్రేడ్ లైసెన్స్‌లు, ప్రజారోగ్యపరంగా సాధారణ అధికారాలే ఉండగా.. కొత్త చట్టంలో అధ్యాయం-33లో ఆహార భద్రత, పోషకాహారం అంశాలను చేర్చారు. దీని ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కన్వీనర్‌గా ‘ఆహార భద్రత, పోషకాహార కమిటీ’ ఏర్పాటు చేస్తారు. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆహార భద్రత మౌలిక సదుపాయాలను సమీక్షించడం, ఆహార పరిశుభ్రత, పోషకాహారం పట్ల అవగాహన కార్యక్రమాలు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు, కలుషిత ఆహార ఘటనల విశ్లేషణ, కారణాల గుర్తింపు, భవిష్యత్ నివారణ చర్యలను చేపడుతుంది.
మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం
క్యూర్ పరిధిలో పర్యావరణ పరిరక్షణకూ బిల్లులో ప్రాధాన్యత ఇచ్చారు. వాతావరణ మార్పులపై యాక్షన్ ప్లాన్, చెరువులు, కుంటల సంరక్షణ, నిర్మాణ వ్యర్థాల శాస్ర్తీయ నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్, విద్యుత్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, ఇతర సదుపాయాల కల్పన, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదల, విపత్తు నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. హైడ్రాకు చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ.. చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించనున్నారు.
పలు కీలక ప్రతిపాదనలివీ..
బిల్లులోని సెక్షన్ 168 ప్రకారం అనుమతి లేని ఆస్తులు, అక్రమ నిర్మాణాల క్రయవిక్రయాలు, బదిలీలు నిషేధం. అనధికార నిర్మాణాల యజమానులకు సంబంధిత అధికారి నోటీస్ జారీ చేసి నిషేధిత జాబితాలో చేర్చుతారు.
క్యూర్ పరిధిలో నైట్ ఎకానమీకి ప్రోత్సాహం అందించే కీలక ప్రతిపాదన చేశారు. పలు ప్రాంతాలను నైట్ ఎకానమీ జోన్లుగా ప్రకటించి రాత్రంతా వ్యాపారాలకు అనుమతి ఇస్తారు.
వ్యాపారవేత్తలు, దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కోసం బహుళ అనుమతులతో ఇబ్బంది పడకుండా ఒకే వ్యాపార లైసెన్సు ఉండనుంది.
కొత్తగా సింగిల్ యుటిలిటీ బిల్లు తేనున్నారు. మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లు, ట్రాఫిక్ చలాన్లు, తాగునీరు, మురుగునీటి చార్జీలు.. ఇలా అన్నీ కలిపి ఏకీకృత బిల్లులో ఉంటాయి.
విపత్తు నిర్వహణ, ట్రాఫిక్, వాతావరణ చర్యలు, వారసత్వ సంపద పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సంస్థలను ప్రతిపాదించారు.
క్యూర్‌లోని ప్రజలకు అన్ని అత్యవసర సేవలకు ఒకే ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తెస్తారు.
పౌరుల ఫిర్యాదులను పరిష్కరించ డానికి క్యూర్ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేస్తారు.
నీటి సరఫరా, మురుగునీటి నియంత్రణపై అధికారం వాటర్‌బోర్డు పరిధిలోకి వస్తుంది.
ఏదైనా విపత్తు తలెత్తితే ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయడానికి క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.
క్యూర్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ కోసం రహదారి భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తారు.
ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యలకు బదులు దశలవారీగా సివిల్ జరిమానాలు ఉంటాయి.
క్యూర్ యుటిలిటీ కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. అన్ని శాఖలను భాగస్వామ్యం చేసి సదుపాయాల పనులను సమన్వయం చేస్తారు.
అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్ల సంక్షేమం, జీవనోపాధి కోసం ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.