Share News

హీలింగ్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:55 AM

ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను హీలింగ్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు.

హీలింగ్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌

  • డేటా సైన్స్‌, డిజిటల్‌ ఆవిష్కరణలతో ‘హెల్త్‌ కేర్‌’ అనుసంధానం

  • సైన్స్‌, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే మేలు: దుద్దిళ్ల

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను హీలింగ్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్‌ కేర్‌ను.. డేటా సైన్స్‌, డిజిటల్‌ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే ఫార్మాస్యూటికల్‌ యూజర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్ఛేంజ్‌ (ఫ్యూజ్‌) ఆధ్వర్యంలో ‘ఫ్యూజ్‌ ఎపాక్‌ కనెక్ట్‌ - 2026’ పేరిట హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్‌ రీసెర్చ్‌, డేటా సైన్స్‌ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సు ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్‌ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి రాబోయే రోజుల్లో క్లినికల్‌ సైన్స్‌, ఏఐ, రియల్‌ వరల్డ్‌ ఎవిడెన్స్‌ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్‌ రీసెర్చ్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్థి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. సైన్స్‌, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందని తెలిపారు. అందుకోసం పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూజ్‌ బోర్డ్‌ చైర్మన్‌ స్టీఫెన్‌ బాఫోర్డ్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ సర్వేశ్‌ సింగ్‌, ఐటీ అడ్వైజర్‌ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 06:56 AM