Share News

సోషల్‌ మీడియా నిర్వాహకులపై కేసులు

ABN , Publish Date - May 16 , 2026 | 05:12 AM

పోక్సో చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి బాధితురాలైన మైనర్‌ బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లి దండ్రుల వివరాలతో సోషల్‌ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్న....

సోషల్‌ మీడియా నిర్వాహకులపై కేసులు

  • బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫొటో, వీడియోల ప్రసారం.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా నిర్వాహకులపైనా చర్యలు

  • 41 యూట్యూబ్‌ చానెళ్లు, సోషల్‌ మీడియా అకౌంట్ల గుర్తింపు.. పేట్‌ బషీరాబాద్‌ పోలీసుల వెల్లడి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): పోక్సో చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి బాధితురాలైన మైనర్‌ బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లి దండ్రుల వివరాలతో సోషల్‌ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై పోక్సో చట్టం ప్రకారం పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాలల హక్కుల సంఘం అధ్యక్షులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశామని పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల ఐడీలు, సంబంధిత యూఆర్‌ఎల్‌లను గుర్తించి ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు వివరాలు పంపినట్లు పోలీసు అధికారులు వివరించారు. పోక్సో కేసుల్లో బాధిత బాలిక వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కాగా, మైనర్‌ బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల వివరాలను ప్రసారం చేసిన యూట్యూబ్‌ చానెళ్లు, ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వరకు 41 యూట్యూబ్‌ చానెళ్లు, సోషల్‌ మీడియా అకౌంట్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 05:12 AM