నెల రోజుల పసికందు కిడ్నాప్.. మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు!
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:29 AM
నెలరోజుల పసికందు అపహరణ కేసును చందానగర్ పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. అంతర్రాష్ట్ర శిశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాకు..
అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
ఐదుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీ , జూలై 3 (ఆంధ్రజ్యోతి): నెలరోజుల పసికందు అపహరణ కేసును చందానగర్ పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. అంతర్రాష్ట్ర శిశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఎం.రమేశ్ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని బాల్కి గ్రామానికి చెందిన సర్కస్ కార్మికురాలు శాంతాబాయి(25) తన బృందంతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సమయంలో జూన్ 30 తెల్లవారుజామున ఇద్దరు దుండగులు నెల రోజుల ఆడశిశువును ఎత్తుకెళ్లారు. బాధితురాలు వెంటనే చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. 3 రోజుల పాటు వందలాది సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించాయని సీపీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన రహనుమా అలీకి సంతానం లేకపోవడంతో డబ్బు ఇచ్చి శిశువును తెప్పించాలని బంధువైన నిమ్మీ జహాన్ అలీని కోరింది. ఆమె తన స్నేహితురాలు నాజియాకు విషయం చెప్పగా, ఆమె తన కాబోయే భర్త మొహమ్మద్ జుబేర్‌కు తెలిపింది. జుబేర్ తన స్నేహితుడు మొహమ్మద్ ఇర్ఫాన్‌తో కలిసి నెలరోజుల పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నవజాత శిశువుల కోసం రెక్కీ నిర్వహించారు. చివరకు లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద చిన్నారిని కిడ్నాప్ చేశారని సీపీ తెలిపారు. రహనుమా అలీ ఈ నెల 1న విమానంలో హైదరాబాద్‌కు వచ్చి చిన్నారిని తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. శిశువు కోసం ప్రధాన నిందితుడు జుబేర్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా రూ.1.50 లక్షల బదిలీ చేసినట్లు గుర్తించారు. చిన్నారిని కోల్‌కతాకు తరలించేలోపే పోలీసులు వారిని సఫిల్‌గూడలో అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం పసికందును ఆమె తల్లికి అప్పగించారు.