Share News

గాయపడిన చిన్నారికి సీపీఆర్‌ చేసి.. కాపాడి!

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:48 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరిన చిన్నారికి సమయస్ఫూర్తితో సీపీఆర్‌ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌) చేసి రాజేంద్రనగర్‌ పోలీసులు ప్రాణాలు కాపాడారు.

గాయపడిన చిన్నారికి సీపీఆర్‌ చేసి.. కాపాడి!

  • రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో బాలుడు

  • సీపీఆర్‌ చేసి కాపాడిన రాజేంద్రనగర్‌ డీసీపీ బృందం

రాజేంద్రనగర్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరిన చిన్నారికి సమయస్ఫూర్తితో సీపీఆర్‌ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌) చేసి రాజేంద్రనగర్‌ పోలీసులు ప్రాణాలు కాపాడారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ కారు అదుపు తప్పి శంషాబాద్‌ ఆరాంఘర్‌ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో మహిళ ఒడిలో కూర్చున్న ఏడాది బాబుకు గాయాలయ్యాయి. అప్పటికే ఆ ఏరియాలో నైట్‌ ఆఫీసర్‌ డ్యూటీలో ఉన్న రాజేంద్రనగర్‌ డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారి పూర్తిగా అపస్మారక స్థితిలో వెళ్లడాన్ని గమనించిన డీసీపీ.. వెంటనే బాలుడికి ప్రథమ చికిత్స అందించాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ఏఆర్‌ కానిస్టేబుళ్లు మహేశ్‌, ప్రదీప్‌, వెంకటేశ్‌, పవన్‌.. బాబుకు సీపీఆర్‌ చేశారు. వీరి ప్రయత్నాలు ఫలించి బాలుడు ఊపిరి పీల్చుకొని ఏడ్వడం ప్రారంభించాడు. అనంతరం బాలుడిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన డీసీపీ, సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈమేరకు ‘ఎక్స్‌’లో ఓ పోస్టు చేశారు.

Updated Date - Jun 21 , 2026 | 04:48 AM