Share News

ఇగ్నైట్‌ ముసుగులో ‘క్యూనెట్‌’ కుట్ర

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:39 AM

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ పేరుతో అమాయకులకు గాలం వేయటం.. అందినకాడికి దోచుకొని జెండా ఎత్తేయటం.. పేరు మార్చుకొని మళ్లీ సరికొత్తగా దోపిడీకి తెరలేపటం.

ఇగ్నైట్‌ ముసుగులో ‘క్యూనెట్‌’ కుట్ర

  • పేరు మార్చుకొని రూ.5 వేల కోట్ల దోపిడీకి ప్రణాళిక

  • మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ పేరుతో అమాయకులకు గాలం

  • ఆరుగురు ప్రధాన నిందితుల అరెస్ట్‌

  • ముందస్తు దర్యాప్తుతో భారీ కుట్రను ఛేదించాం

  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ పేరుతో అమాయకులకు గాలం వేయటం.. అందినకాడికి దోచుకొని జెండా ఎత్తేయటం.. పేరు మార్చుకొని మళ్లీ సరికొత్తగా దోపిడీకి తెరలేపటం. 25 ఏళ్లపాటు దేశంలో లక్షల మందిని నిండా ముంచిన క్యూనెట్‌ సంస్థ.. తాజాగా మరోసారి ఇగ్నైట్‌ పేరుతో దోపిడీకి తెరలేపింది. అయితే, ఈసారి ఆ సంస్థ ఆటలను హైదరాబాద్‌ పోలీసులు సాగనివ్వలేదు. ఆదిలోనే గుర్తించి ఆట కట్టించి, దాదాపు రూ.5 వేల కోట్ల భారీ మోసం జరగకుండా అడ్డుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో పాగా వేసి ఇగ్నైట్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ఆరుగురు కీలక నిందితులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నోయిడాకు చెందిన ఒనియల్‌ గుప్తా, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన దినే్‌షకుమార్‌ సాహిల్‌, ప్రియాన్షు సక్సేనా, కోల్‌కతాకు చెదిన ప్రవీణ్‌ కుమార్‌ దకాలియా, పరితోష్‌ కుమార్‌ దకాలియా, కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన రియాజ్‌లను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. వీరంతా గతంలో క్యూనెట్‌లో సీనియర్‌ లీడర్లుగా పనిచేశారని.. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఇగ్నైట్‌ సంస్థకు బాధ్యులుగా ఉంటూ కొత్తవారిని చేర్చుకుంటున్నారని తెలిపారు. హాంకాంగ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇగ్నైట్‌ సంస్థను నిందితులు గత మే 18న చండీగఢ్‌లో రిజిస్టర్‌ చేయించారు. వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఈ సంస్థలో చేర్పించటం ద్వారా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించినట్లు సీపీ తెలిపారు. అయితే, ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 18 రోజులకే కుట్రను భగ్నం చేసినట్లు చెప్పారు.


25 ఏళ్లలో అనేక రూపాలు..

చెన్నైకి చెందిన పత్మన్‌ సేనాధి రాజా అక్కడే 1998 నుంచి 2005 వరకు గోల్డ్‌ క్వెస్ట్‌ పేరుతో సంస్థను నిర్వహించాడు. లక్షల మందిని ముంచిన ఈ సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి. 10కి పైగా దేశాలు దీనిపై నిషేధం విధించాయి. దీంతో ఇతడు హాంకాంగ్‌కు పారిపోయాడు. ఆ తర్వాత క్వెస్ట్‌ నెట్‌ పేరుతో గోల్డ్‌ క్వెస్ట్‌ సంస్థ చెన్నై కేంద్రంగానే 2005 నుంచి 2012 వరకు మళ్లీ మోసాలకు పాల్పడింది. దీనిపై దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే సంస్థ నిర్వాహకులు 2012లో క్యూనెట్‌/ విహాన్‌ డైరెక్ట్‌ సెల్ల్లింగ్‌ పేరుతో మళ్లీ మోసానికి తెరలేపారు. ముంబై, పుణె, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇగ్నైట్‌ పేరుతో మరోసారి మోసాలకు తెరలేపింది. బాధితుల నుంచి కాజేసిన డబ్బును ఏడు దశల్లో హాంకాంగ్‌లో ఉన్న ప్రధాన నేరగాళ్లకు పంపుతున్నారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. దోపిడీ సొమ్మును యూఎ్‌సటీడీ క్రిప్టో కరెన్సీలోకి మార్చి హాంకాంగ్‌లోని ఇగ్నైట్‌ నిర్వాహకుల ఈ వాలెట్‌లోకి పంపుతారని సీపీ చెప్పారు.

రూ.600 ఎలక్ట్రికల్‌ బ్రష్‌ రూ.60 వేలు

ఈ సంస్థ మోసాల గురించి సీపీ వివరించారు. డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరుతో ముఖంపై ముడతలు పడిన చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేసే అయస్కాంత పెన్‌ రూ.1 లక్ష, శరీరంలో శక్తిని సమతుల్యం చేసే యాక్టివా పేరుతో చతురస్రాకార గాజుమక్క రూ.1 లక్ష, మార్కెట్‌లో రూ.600లకు లభించే సాధారణ ఎలక్ట్రిక్‌ టూత్‌బ్ర్‌షను రూ.60 వేలకు విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ ఉత్పత్తులకు భారతీయ, విదేశీ నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుతులు లేవన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:39 AM