మందుబాబులపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:45 AM
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జైలుశిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారు.
మద్యం తాగి పట్టుబడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు, కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం
హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) హెచ్చరిక
న్యూ ఇయర్ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో పట్టుబడ్డ 270 మందికి జైలు
హైదరాబాద్ సిటీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జైలుశిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి వివరాలను.. వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యాసంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) జోయెల్ డేవిడ్ హెచ్చరించారు. ఇక, కొత్త ఏడాది వేడుకల్లో మద్యంమత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందుబాబులకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డవారు గురువారం కటకటాల వెనక్కు వెళ్లారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని ‘రోడ్డు టెర్రరిస్టు’లతో పోల్చిన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబరు 24 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1200మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది. వీరికి ఒకటి నుంచి మూడురోజుల పాటు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.