సాధారణ మహిళగా సీపీ సుమతి అర్ధరాత్రి ఒంటరిగా.. నడిరోడ్డుపై..
ABN , Publish Date - May 07 , 2026 | 05:41 AM
అది నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్. సమయం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. అప్పుడే ఓ మహిళ.. బస్సు కోసం నిరీక్షిస్తున్నట్లుగా అక్కడికి చేరారు.
పోకిరీల ఆటకట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్
దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు దగ్గర్లో సీపీ సాహసం
చుట్టుముట్టిన పోకిరీలు.. మద్యం మత్తులో వేధింపులు
40 మంది అదుపులోకి.. అంతా విద్యార్థులు, ఉద్యోగులే
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్
తోకలు కట్‌చేస్తానని వార్నింగ్ ఇచ్చిన మల్కాజిగిరి సీపీ
హైదరాబాద్ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): అది నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్. సమయం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. అప్పుడే ఓ మహిళ.. బస్సు కోసం నిరీక్షిస్తున్నట్లుగా అక్కడికి చేరారు. తాను ఎక్కాల్సిన బస్సు రాలేదన్నట్లుగా అటూ ఇటూ తిరిగారు. అంతే.. పలువురు పోకిరీలు బైక్‌లపై వచ్చి ఆమె చుట్టూ రౌండ్లు కొట్టడం మొదలుపెట్టారు. వెకిలిచేష్టలకు దిగారు. ‘ఎంతకొస్తావ్? ఎటు వెళ్దాం?’ అంటూ వేధించారు. ఇలా.. అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన వేధింపులు.. తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి. వాటిని మౌనంగా భరించిన ఆ మహిళ అలాగే అక్కడ ఉన్నారు. అంతసేపయినా.. అటువైపు గస్తీ పోలీసులు ఒక్కరు కూడా రాలేదు. చివరకు 3 గంటల తర్వాత అటుగా వచ్చిన గస్తీ కానిస్టేబుల్.. ఆ మహిళ చుట్టూ ఉన్న పోకిరీల గుంపును చూసి అక్కడికి వెళ్లాడు. ఆ మహిళను చూసి షాకయ్యాడు. ఆపై వెంటనే ఆమెకు సెల్యూట్ చేశాడు. దీనిని చూసి అక్కడున్న పోకిరీలు షాకయ్యారు. ఎందుకంటే.. అక్కడ ఉన్నది మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి. ఇటీవలే కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుమతి.. తొలుత మహిళల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ అర్ధరాత్రి పోకిరీలు, ఆకతాయిలు, తాగుబోతులు మహిళలను వేధిస్తున్నారు, ఎక్కడ సమస్య తీవ్రంగా ఉందనే విషయంపై ఆరా తీశారు. సరూర్‌నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ల పరిఽధిలో పోకిరీల సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో దిల్‌సుక్‌నగర్ బస్టాండు పరిసర ప్రాంతాల్లో మూడు రోజులపాటు రాత్రిపూట రెక్కీ నిర్వహించారు. సమస్య తీవ్రతను గుర్తించిన సీపీ.. మంగళవారం అర్ధరాత్రి దాటాక స్వయంగా రంగంలోకి దిగారు.
నిద్రపోతున్న నిఘా..
ఒక సాధారణ మహిళగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన సుమతి.. పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యాన్ని కళ్లారా చూశారు. పోకిరీల గుంపు రోడ్డుపై ఒక మహిళను ఇంతలా వేధిస్తున్నా.. గస్తీ పోలీసు వాహనాలు మచ్చుకైనా కనిపించకపోవడాన్ని గుర్తించారు. మూడు గంటలపాటు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో మొత్తం 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం నగరానికి వచ్చినవారుగా తేలింది. హాస్టళ్లలో ఉంటూ.. మద్యం, గంజాయికి అలవాటుపడి మత్తులో రోడ్డుపై తిరుగుతూ.. అర్ధరాత్రి మహిళలను వేఽధింపులకు గురిచేస్తున్నట్లు నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సీపీ.. ఇకపై అర్ధరాత్రి రోడ్డుపై అకారణంగా తిరిగినా, మద్యం, గంజాయి మత్తును మానుకోకపోయినా తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, సుమతి 2001లో కాజీపేట డీఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ ఇలాంటి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం సృష్టించారు.