Share News

హోటళ్లకు కుళ్లిన తలకాయ మాంసం!

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:35 AM

స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మృతి చెందిన మేకలు, గొర్రెల తలకాయలు...

హోటళ్లకు కుళ్లిన తలకాయ మాంసం!

  • నిల్వ ఉంచి సరఫరా చేస్తున్న వ్యాపారి

  • కశ్మీర్‌, యూపీ, మహారాష్ట్ర నుంచి మృతి చెందిన మేకలు తెప్పించి సరఫరా

  • మంగళ్‌హాట్‌లోని గోదాములపై దాడులు

  • నలుగురి అరెస్టు.. నెలలో రెండో కేసు

హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మృతి చెందిన మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లను ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెప్పించి.. కుళ్లిపోయిన మాంసాన్ని హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా కల్తీ ఆహార పదార్థాల తయారీపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు.. తాజాగా జరిపిన మరో భారీ ఆపరేషన్‌లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌ పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలోని మంగళ్‌హాట్‌ ఖిస్తీ చమన్‌లో అఫ్రోజ్‌ అనే వ్యక్తి ‘ఏ టు జడ్‌ షీప్‌ అండ్‌ గోట్‌ అఫల్స్‌’ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. మేకలు, గొర్రెలకు సంబంధించిన తల, కాళ్లు, పొట్ట తదితర విడిభాగాలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. కాగా, రెండు గోదాముల్లో కుళ్లిన, పాడైన మేక కాళ్లు, తలకాయలు నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో గోల్కొండ టాస్క్‌ఫోర్స్‌, హెచ్‌ఫా్‌స్ట పోలీసులు.. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో 600 కేజీల కుళ్లిన తలకాయలు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక అఫ్రోజ్‌ కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడు జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి చనిపోయిన మేకలను తక్కువ ధరకు తెప్పించి, ఇక్కడ నిల్వ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కుళ్లిన మాంసాన్ని నగరంలోని వివిధ హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అఫ్రోజ్‌ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గోదాములను సీజ్‌ చేసి.. మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర తెలిపారు. కాగా, కుళ్లిన మాంసానికి సంబంధించి నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. తాజా కేసులో నిందితుడైన అఫ్రోజ్‌కే చెందిన గోదాంపై పోలీసులు మార్చి 11న దాడి చేసి కుళ్లిపోయిన 300 కిలోల మాంసాన్ని సీజ్‌ చేశారు. దీంతో వరుస ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Updated Date - Apr 02 , 2026 | 03:35 AM