లక్షల్లో పెట్టుబడి.. కోట్లల్లో లాభం!
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:37 AM
విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీములు పెట్టి.. వేలాది మంది నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
మనీ సర్క్యులేషన్ స్కీంలతో క్యూనెట్ మస్కా.. హైదరాబాద్ కేంద్రంగా వేల మంది నుంచి రూ.వందల కోట్ల దోపిడీ
విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దందా
పేర్లు మార్చుకుంటూ మోసాలు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులే లక్ష్యం
మూడు రాష్ట్రాల్లో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసుల దాడులు
11 మంది మహిళలు సహా.. 32 మంది అరెస్టు
ఇలాంటి స్కీములను నమ్మొద్దు
హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచన
హైదరాబాద్ సిటీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీములు పెట్టి.. వేలాది మంది నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 32 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ మోసాలపై సీసీఎస్‌లో 4 కేసులు నమోదు కావడంతో దర్యాప్తు కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. స్పెషల్ బ్యాంచ్ జాయింట్ సీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో.. సీసీఎస్ అదనపుసీపీ శ్రీనివాస్, డీసీపీ చైతన్యకుమార్, వెంకటలక్ష్మి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ సంస్థ గుట్టును రట్టు చేశాయి. ఈ కేసు వివరాలను బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వెల్లడించారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టిందని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించినట్లు వివరించారు.
పేర్లు మార్చుకుంటూ.. దోపిడీ
మొదట గోల్డ్ క్వెస్ట్ పేరుతో ప్రారంభమైన ఈ మనీ సర్క్యులేషన్ దందా.. ఆ తర్వాత క్వెస్ట్ నెట్‌గా మారింది. ప్రస్తుతం క్యూనెట్‌గా పేరు మార్చుకొని అమాయకులను ముంచుతోంది. ఇది హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూఐ గ్రూప్’నకు అనుబంధ సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో, కాఫీ షాపుల్లో, ఐటీ సంస్థల్లోని ఖాళీ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించి ఈ-కామర్స్ వ్యాపారం, పెట్టుబడులపై సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే స్కీములతోపాటు రెండో ఆదాయ మార్గాన్ని చూపుతామని నమ్మబలుకుతున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెడితే, రెండేళ్లలో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు లాభం వస్తుందని నమ్మించి ఊబిలోకి లాగుతున్నారని సీపీ తెలిపారు. తేనె, బిస్కట్స్, హెర్బల్ ఉత్పత్తులను బహుమతులుగా ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. వీటితో ఏం వ్యాపారం చేస్తామని ప్రశ్నించిన సభ్యులకు ఇది మనీ సర్క్యులేషన్ స్కీము అని అసలు విషయం చెబుతున్నారు. కొత్త సభ్యులను చేర్పించి, వారితో పెట్టుబడులు పెట్టించి రూ.లక్షల్లో సంపాదించండి అంటూ ఉచ్చు బిగిస్తున్నారు.
అఫడవిట్ బాండ్లతో బ్లాక్‌మెయిల్..
క్యూనెట్ సంస్థ మోసం బయటపడితే నేరం తనపైకి రాకుండా ముందుజాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఈ స్కీములో చేరిన బాధితులతో ‘నేను స్వయంగా, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఈ స్కీములో, ఈ సంస్థలో సభ్యుడిగా చేరాను. సంస్థలో నా ద్వారా జరిగే అన్ని విషయాలకు నేనే బాధ్యత వహిస్తాను’ అని అఫిడవిట్ బాండు రాయించుకుంటున్నారు. దాంతో మోసపోయిన బాధితులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఏం చేసినా లీగల్‌గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉంటుందని క్యూనెట్ సంస్థ ప్రతినిధులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. దీంతో అటు సంస్థను ఏమీ చేయలేక, తాము చేర్పించిన సభ్యులకు సమాధానం చెప్పలేక సభ్యులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇటీవల సిద్దిపేటలో హరికృష్ణ అనే యువకుడు క్యూనెట్ సంస్థ చేసిన మోసానికి ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని సీపీ చెప్పారు. సీసీఎస్‌లో నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితుల నుంచి సుమారు రూ.75 లక్షలు విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ కొల్లగొట్టినట్లు తేలిందని అన్నారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పథకాల్లో చేరి ప్రముఖ ఐటీ కంపెనీల ఉద్యోగులు చాలామంది మోసపోయారని చెప్పారు. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఐటీ కంపెనీలకు లేఖలు రాస్తామని, కంపెనీల్లో సెమినార్లు నిర్వహించకుండా చూడాలని కోరుతామని పేర్కొన్నారు.
రుణాలు ఇప్పించి మరీ కుచ్చుటోపీ..
కొంతమంది ఐటీ ఉద్యోగులకు ఈ సంస్థ ఏజెంట్లు బ్యాంకు రుణాలు ఇప్పించి మరీ ఉచ్చులోకి లాగుతున్నారు. వారికి అనుకూలంగా ఉన్న బ్యాంకుల్లో ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో రుణాలు ఇప్పించి, వాటిని పెట్టుబడుల పేరుతో క్యూనెట్ సంస్థ ఖాతాల్లోకి మళ్లిస్తారు. తర్వాత నీ డబ్బులు నీకు రావాలంటే ఈ సంస్థ బైనరీ స్కీమ్ (1+2+4+8...)లో సభ్యులను చేర్పించాలని షరతు విధిస్తున్నారు. ఇందులో మొదట చేరిన వారిని ‘ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్స్’ అంటారు. కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమీషన్లు వస్తాయని ఆశ చూపిస్తారు. బాధితులు ప్రారంభంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను చేర్పిస్తున్నారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవటం, కొత్తవారు కూడా మరికొందరిని విధిగా చేర్పించాల్సి రావటంతో ఈ మోసం బయటకు వస్తుంది. ‘ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధిత) చట్టం, 1978’ ప్రకారం ఇలాంటి స్కీములు నిర్వహించటం నేరమని సీపీ తెలిపారు. సుప్రీంకోర్టు సైతం ఇలాంటి పథకాలు ప్రజలను మోసం చేసే మార్గాలని గతంలో వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.