Share News

స్పీడ్‌ పోస్టులో గంజాయి

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:55 AM

తపాలా శాఖ స్పీడ్‌ పోస్టు సేవలను ఉపయోగించుకొని గంజాయిని వినియోగాదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు.

స్పీడ్‌ పోస్టులో గంజాయి

  • ఝార్ఖండ్‌ కేంద్రంగా ఓ ముఠా దందా

  • వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల ద్వారా ఆర్డర్లు

  • మందులంటూ స్పీడ్‌ పోస్టులో డెలివరీ.. 4 ఏళ్లుగా 21 రాష్ట్రాలకు..

  • ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ స్పీడ్‌ పోస్టు సేవలను ఉపయోగించుకొని గంజాయిని వినియోగాదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ యాప్‌ల ద్వారా కోడ్‌ భాషలో గంజాయి ఆర్డర్లు తీసుకునే ఆ ముఠా... ఔషధాల పేరిట పోస్టాఫీసుల్లో పార్సిళ్లు బుక్‌ చేస్తూ గంజాయి సరఫరా చేసి నాలుగేళ్లలో రూ.కోట్లు సంపాదించింది. ఝార్ఖండ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆ ముఠాలోని కీలక సూత్రధారి సత్యం మిశ్రాను హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ విలేకరులకు గురువారం వెల్లడించారు.

ఝార్ఖండ్‌, గిరిడీ జిల్లాలోని తాంబగుడియాకి చెందిన సత్యం మిశ్రా.. తన అన్న శుభం మిశ్రా, బంధువులు రాహుల్‌ ఝూ అలియాస్‌ ఛోటే మిశ్రా, సచిన్‌ మిశ్రా, సంతోష్‌ పండిత్‌తో ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపాడు. గతంలో లారీడ్రైవర్‌గా పని చేసిన సత్యం మిశ్రా.. 2018లో ముంబైలో ఉన్న సమయంలో గంజాయికి బానిసయ్యాడు. గంజాయి, డ్రగ్స్‌ అలవాట్లు ఉన్నవారితో పరిచయాలు చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో స్వగ్రామానికి చేరుకున్న సత్యం మిశ్రా తన అన్నతో కలిసి గంజాయి సాగు ప్రారంభించాడు. గ్రామ ప్రజలను కూడా గంజాయి సాగు వైపు ప్రోత్సహించాడు. అయితే, కార్లు, బస్సుల్లో గంజాయిని తరలిస్తే పోలీసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా తపాలా సేవలను గుర్తించారు.


ఔషధాల అని చెప్పి పార్సిల్‌ బుక్‌ చేస్తే పోస్టాఫీసులో ఎలాంటి స్కానింగ్‌ లేకుండా పంపిస్తుండడాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. పోస్టల్‌ శాఖ చేరవేస్తున్న పార్సిళ్లు కావడంలో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో తనిఖీలు ఉండడం లేదు. దీంతో ముఠాలోని రాహుల్‌ ఝూను వైద్యుడిగా చూపుతూ ఔషధాలు పార్సిల్‌ చేస్తున్నామని పోస్టల్‌ సిబ్బందికి చెప్పి మభ్య పెట్టేవారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం.. డబ్బు చేతికందిన వెంటనే సత్యం, శుభం గంజాయి పార్సిళ్లు సిద్ధం చేస్తే... రాహుల్‌ ఝూ వాటిని స్పీడ్‌ పోస్టు చేసేవాడు. ఇందుకోసం ఝార్ఖండ్‌లోని ఇస్త్రీ బజార్‌, ఫుస్త్రోబజార్‌ పోస్టాఫీసులను వినియోగించేవారు. ఇలా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలకు గంజాయిని డోర్‌ డెలివరీ చేసిన ఈ ముఠా ముంబైలో మాత్రం వినియోగదారులకు స్వయంగా సరుకు అందజేసేది. శుభం మిశ్రా రైళ్ల ద్వారా గంజాయిని ముంబైకి తరలిస్తే.. అక్కడే మకాం పెట్టిన సచిన్‌ మిశ్రా, సంతోష్‌ పండిత్‌ వినియోగదారులకు అందజేసేవారు. ఇక, ఆన్‌లైన్‌ మెసేజ్‌ల్లో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. గంజాయి అనే పేరు వాడకుండా మ్యాంగో, స్టిక్‌, ఫ్లవర్‌ వంటి కోడ్‌లను వాడేవారు. ఒక మ్యాంగో అంటే 50 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ అని, 2 మ్యాంగోలు అంటే 100 గ్రాములు గంజాయి అని అర్థం. ఇలా ఏడాదికి రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ చేసిన ఈ ముఠా నాలుగేళ్లలో భారీగా సంపాదించింది. ఈ సంపాదనతో వీరు భారీగా బంగారు ఆభరణాలు. విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశారు.


హైదరాబాద్‌కు స్పీడ్‌ పోస్టు పంపి దొరికేశారు..

ఈ స్పీడ్‌ పోస్టు దందాపై పోలీసులకు సమాచారం అందగా.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు, మరో ప్రాంతానికి స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపిన గంజాయి పార్సిళ్లను అందుకున్న సుశాంత్‌ వ్యాస్‌, లడ్డు అనే ఇద్దరిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్‌ వెళ్లి సత్యం మిశ్రాను అరెస్ట్‌ చేశారు. శుభం మిశ్రా, సచిన్‌ మిశ్రా, సంతోష్‌ పండిత్‌, రాహుల్‌ ఝూ పరారీలో ఉన్నారు. కాగా, కొరియర్‌, కార్గో సేవల సంస్థలు ప్రతీ పార్సిల్‌ను స్కాన్‌ చేయాలని సీపీ సజ్జనార్‌ సూచించారు. రైళ్లు, విమానాల ద్వారా పార్సిళ్ల రవాణా జరుగుతుండడంతో నిషేధిత పదార్థాలను గుర్తించేందుకు ఆయా శాఖలూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Updated Date - Jul 03 , 2026 | 06:56 AM