Share News

నగదు ఇస్తేనే ఇంధనం.. ఆయిల్‌ కంపెనీల మెలికతో పలుచోట్ల మూతపడిన బంకులు..

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:18 AM

నగదు ఇస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తామంటూ ఆయిల్‌ కంపెనీలు కొత్త మెలిక పెట్టడంతో హైదరాబాద్‌లో కొన్ని బంకులకు సరఫరా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగదు ఇస్తేనే ఇంధనం.. ఆయిల్‌ కంపెనీల మెలికతో పలుచోట్ల మూతపడిన బంకులు..

  • క్రెడిట్‌ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు

  • నగ దులేక ఆగిన కొనుగోళ్లు

  • గ్రేటర్‌లో వాహనదారులకు ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నగదు ఇస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తామంటూ ఆయిల్‌ కంపెనీలు కొత్త మెలిక పెట్టడంతో హైదరాబాద్‌లో కొన్ని బంకులకు సరఫరా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్‌, డీజిల్‌ కొనడం ఆపేశారు. ఇంతకుముందు ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్‌ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న క్రెడిట్‌ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌లను సరఫరా చేస్తున్నాయి. నగదు చెల్లించలేని డీలర్లు బంకులను మూసివేశారు. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై లాభాలు తగ్గి, నిర్వహణ ఖర్చులు పెరిగాయని.. విద్యుత్‌ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ వ్యయాలు పెరిగినా మార్జిన్‌ పెరగలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ సదుపాయం ఆపేయడంతో ఆయిల్‌ కంపెనీలకు నగదు చెల్లించలేని యజమానులు బంకులను మూసివేస్తున్నారు. తమ డిమాండ్లు నేరవేర్చాలంటూ ఆయిల్‌ కంపెనీలను కోరుతున్నారు. కాగా హైదరాబాద్‌లో పలు చోట్ల పెట్రోల్‌ పంపుల యజమానులు బంకులను మూసివేయడంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం మరికొన్ని చోట్ల క్యూలు కనిపించాయి. కొన్ని బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగి పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అంబులెన్సులు, పోలీస్‌ వాహనాలు, అగ్నిమాపక శాఖ వాహనాలకు ప్రత్యేకంగా ఇంధనం అందిస్తున్నట్లు డీలర్ల సంఘం తెలిపింది. కాగా బ్రాండెడ్‌ ఇంధనాలైన ఇండియన్‌ ఆయిల్‌ ప్రీమియం, హెచ్‌పీ పవర్‌, భారత్‌ పెట్రోలియం స్పీడ్‌ ఇంధనాలను ఎక్కువ మొత్తంలో విక్రయించలేకపోవడం, బంకుల్లోనే స్టాక్‌ ఉండిపోవడంతోపాటు చేతిలో సరిపడా నగదు లేకపోవడంతోనే ఈ పరిస్థితికి దారితీసిందని నగరంలోని ఓ పెట్రోల్‌ బంకు డీలరు తెలిపారు.డీలర్ల ఆందోళనపై ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్చలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇంధన కొరత లేదు...

మార్చి 31వరకు అమల్లో ఉండే ఆయిల్‌ కంపెనీల నిబంధనలే తాజా పరిస్థితికి కారణమని పలువురు పెట్రోల్‌ బంకుల డీలర్లు చెబుతున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీలర్లు, పెట్రోలియం శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 24 , 2026 | 07:21 AM