ఔటర్ రింగ్ రోడ్డుపైనా రద్దీ!
ABN , Publish Date - May 12 , 2026 | 03:54 AM
ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఔటర్‌పై ఓ వైపు నాలుగు లేన్లు.. మరో వైపు నాలుగు లేన్లు ఉన్నా.. వాహనాలు పోటీపడినట్లుగా ప్రయాణిస్తున్నాయి.
ఏటా పెరుగుతున్న వాహనాలు
ప్రస్తుతం రోజు వారీగా సగటు వాహనాల సంఖ్య 2.70లక్షలపైనే
గతఏడాది ఫిబ్రవరిలో 2.20లక్షలే
హైదరాబాద్ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఔటర్‌పై ఓ వైపు నాలుగు లేన్లు.. మరో వైపు నాలుగు లేన్లు ఉన్నా.. వాహనాలు పోటీపడినట్లుగా ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా సగటున 2.70లక్షల నుంచి 2.80లక్షల వరకు వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో సర్వీసు రోడ్డును వెడల్పు చేసినా.. చాలా మంది వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేయడానికి ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర 8లేన్లతో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడానికి వీలుగా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించిన విషయం తెలిసిందే. 2012లో ఓఆర్‌ఆర్ అందుబాటులోకి రాగా.. మొదటి రోజు వాహనాల సంఖ్య వెయ్యిని మించలేదు. తొలుత శంషాబాద్ విమానశ్రయానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డు క్రమేణా విస్తరిస్తూ వచ్చింది. 2014లో సగటున రోజుకు 43,856 వాహనాలు ప్రయాణించాయి. ఇక, 2018లో సగటున రోజుకు 91,410 వాహనాలు, 2019లో రోజుకు సగటున లక్ష వాహనాలు, 2022 వచ్చేసరికి రోజుకు సగటున 1.35లక్షల వాహనాలు తిరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డును 30ఏళ్ల పాటు టీవోటీ ప్రతిపాదికన లీజుకు ఇచ్చే సమయానికి (2023 మే నాటికి) ఔటర్‌పై రోజుకు 1.65లక్షల వాహనాలు ప్రయాణించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఔటర్‌పై రోజూ 2.20లక్షల వాహనాలు ప్రయాణించగా.. ప్రస్తుతం ఏకంగా 2.70లక్షల నుంచి 2.80లక్షల మేర వాహనాలు తిరుగుతున్నాయి. అంటే.. ఏడాదిలోనే రోజూవారీ వాహనాల సగటు 50-60వేల దాకా పెరిగింది.