పాత అపార్ట్‌మెంట్లు..నిషేధిత జాబితాలో!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:20 AM
రాజధాని నగరంలో ఎప్పుడో దశాబ్దాల క్రితం భూమిని కొనుగోలు చేసి అన్నిరకాల అనుమతులతో నిర్మాణం చేపట్టిన అపార్ట్‌మెంట్ల్లు.. నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి.
22ఏ జాబితాలో చేరుస్తున్న కలెక్టర్లు
గతంలో అన్ని అనుమతులతో నిర్మాణం
ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటున్న అధికారులు
కొత్తగా రిజిస్ట్రేషన్‌కు వెళితే నిరాకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లు
భూ రికార్డుల సవరణతో మూల రికార్డులను పరిగణనలోకి తీసుకుంటున్నామంటున్న కలెక్టర్లు
ఆందోళనలో ఫ్లాట్ల కొనుగోలుదారులు
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో ఎప్పుడో దశాబ్దాల క్రితం భూమిని కొనుగోలు చేసి అన్నిరకాల అనుమతులతో నిర్మాణం చేపట్టిన అపార్ట్‌మెంట్ల్లు.. నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. ఆ అపార్ట్‌మెంట్లను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం వెళితే.. అవి 22ఏ జాబితాలో ఉన్నాయని, వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరని సబ్ రిజిస్ట్రార్‌లు చెబుతున్నారు. భూ రికార్డుల సవరణ నేపథ్యంలో మూల రికార్డుల పేరుతో కలెక్టర్లు.. ఆ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ, వాటిలోని నిర్మాణాలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. ఉదాహరణకు.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎస్‌బీహెచ్ సొసైటీ కొంత భూమిని కొనుగోలు చేసి.. ప్లాట్లుగా విభజించి.. సొసైటీ సభ్యులకు విక్రయించింది. అందులో పి.సీతారామయ్య అనే సభ్యుడు 327 గజాల స్థలం దక్కించుకున్నారు. ఆయనకు వచ్చిన ప్లాట్ నంబరు 53లో 2004లో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు. 2007 నాటికి ఈ స్థలంలో 7 ఫ్లాట్లు, ఒక పెంట్‌హౌస్‌తో అపార్ట్‌మెంట్ భవనాన్ని నిర్మించారు. 2007-2008 మధ్య ఇందులో ఉన్న ఫ్లాట్లలో మూడు విక్రయించారు. 2014లో మరొకటి విక్రయించారు. తాజాగా ఇదే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్‌ను విక్రయానికి పెట్టగా, ‘‘మీ అపార్ట్‌మెంట్ ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. రిజిస్ర్టేషన్‌కు అనుమతించబోం’’ అని సబ్ రిజిస్ర్టార్ చెప్పారు. మరో ఘటనలో.. శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్‌లో 30 ఏళ్ల క్రితం 150 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ నిర్మించారు. ఇప్పుడు ఇవన్నీ 22ఏ జాబితాలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
సమాధానం చెప్పలేని స్థితిలో సబ్ రిజిస్ట్రార్‌లు..
దిల్‌సుఖ్‌నగర్, శ్రీనగర్ కాలనీలోనే కాకుండా రాజధాని నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. కూకట్‌పల్లి, మియాపూర్, బాచుపల్లి, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్, నార్సింగి, కొండాపూర్, గండిపేట.. ఇలా అనేక ప్రాంతాల్లో కొనుగోలుదారులు అవస్థ పడుతున్నారు. గండిపేటలో ఓ బిల్డర్ 51 విల్లాలతో ఓ ప్రాజెక్టు నిర్మించగా.. ప్రస్తుతం ఆ భూమి 22ఏ జాబితాలో పడిపోయింది. దీంతో నిర్మాణదారు సోదరుడు రిజిస్ర్టేషన్ శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితి ఎందుకొచ్చిందనే అంశం శుక్రవారం రిజిస్ర్టేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నగరంలో పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ర్టార్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి.. తాను కుర్చీలో కూర్చోలేకపోతున్నానని, ఈ సమస్యకు సమాధానం చెప్పడం తమ వల్ల కావడం లేదని వాపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు..
ఇబ్బడి ముబ్బడిగా చేరుస్తున్న కలెక్టర్లు..
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో సమస్య తీవ్రత అధికంగా ఉంది. భూ రికార్డుల సవరణ నేపథ్యంలో మూల రికార్డులను పరిగణనలోకి తీసుకుంటున్న కలెక్టర్లు.. అందులో ఉన్న వివరాల ఆధారంగా ప్రభుత్వ భూమి అని కనిపిస్తే చాలు.. 22ఏ జాబితాలో పెట్టేస్తున్నారు. దీంతో సంవత్సరాల క్రితం అన్నిరకాల అనుమతులు తీసుకుని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారికి వాస్తవ పరిస్థితులు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. సీలింగ్ ల్యాండ్‌లో ఉందని, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు.. ఇలా పలు రకాల ప్రభుత్వ భూముల జాబితాలో చూపడంతో అపార్ట్‌మెంట్‌లో కొనుగోలు చేసినవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఓఆర్‌ఆర్ లోపల ఉన్న ఓ జిల్లా కలెక్టర్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. పాత రికార్డుల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటున్నామని, దీనివల్ల చాలా అపార్ట్‌మెంట్లు ప్రభుత్వ భూముల జాబితాలోకి వస్తున్నాయని అన్నారు. తమ వద్ద భూముల క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఇబ్బందిగా ఉంటోందన్నారు. 22ఏ జాబితాలో ఉన్న అపార్ట్‌మెంట్ నివాసితులు.. వారి బిల్డర్ నుంచి లేదా భూ యజమాని నుంచి గతంలో ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణ అనుమతులు పొందిన పత్రాలు ఏవైనా ఉంటే చూపించాలని, అప్పుడు 22ఏ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకు కనిపించడం లేదన్నారు.
హెచ్‌ఎండీఏ, హుడా లేఅవుట్లలోనూ తప్పని ఇబ్బందులు..
నగరంలో చాలా చోట్ల పది, పదిహేనేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ, హుడా లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు కూడా ఈ సమస్య తప్పడంలేదని రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. హుడా లేఅవుట్ అని కొనుగోలు చేసి, అన్నిరకాల అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాక.. ఇప్పుడు ప్రభుత్వ భూమి అని కలెక్టర్లు 22ఏ జాబితాలు పంపుతున్నారని అంటున్నారు. హుడా లేఅవుట్లు, హౌసింగ్ బోర్డు ప్లాట్లు, హెచ్‌ఎండీఏ విక్రయించిన ప్లాట్లను కూడా 22ఏ జాబితాలో పెడితే.. కొనుగోలుదారులు ఎలా బయటపడాలని ప్రశ్నించారు.