చకచకా కొత్త ఉస్మానియా ఆస్పత్రి పనులు
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:59 AM
కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో 14 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు.
ఉగాదికి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం
ఏర్పాట్లపై మంత్రి దామోదర సమీక్ష
హైదరాబాద్ సిటీ/ హైదరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో 14 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించే ఈ అసుపత్రిలో రోగుల రద్దీకి అనుగుణంగా 2వేల పడకలను ఏర్పాటుచేస్తున్నారు. 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, అవయమార్పిడి యూనిట్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. ఆస్పత్రిలో నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 18 అప్రోచ్ రోడ్లు అవసరమవుతుండటంతో అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేశారు.
ఆధునిక హంగులతో సనత్‌నగర్ టిమ్స్
సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ టస్టు ఆఫీసులో సనత్ నగర్ టిమ్స్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1000 పడకల సామర్ధ్యంతో ఆసుపత్రిని నిర్మించామని, 16 ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్-రే మిషన్‌ల బిగింపు ప్రక్రియ పూర్తయిందని, డయాగ్నస్టిక్ యంత్రాల బిగింపు పని జరుగుతోందని అధికారులు వివరించారు. మార్చి 15నాటికి పనులన్నింటినీ పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో సనత్‌నగర్ టిమ్స్ కీలకం కానుందని దామోదర చెప్పారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై కూడా మంత్రి అధికారులతో మాట్లాడారు.