హైస్పీడ్ రైలు.. కోకాపేటలో స్టేషన్!
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:22 AM
హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్‌లో ...
శంషాబాద్, వికారాబాద్‌లోనూ ఏర్పాటు
హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు డీపీఆర్‌కు ఆమోదం
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్‌లో స్టేషన్లు నిర్మించాలని అందులో ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆ తర్వాత కర్ణాటకలో ఒకటి, మహారాష్ట్రలో తొమ్మిది స్టేషన్లు కలిపి.. మూడు రాష్ట్రాల్లో మొత్తం 13 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి పుణె వరకు మాత్రమే హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవలి బడ్జెట్‌లో హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ - చెన్నె, హైదరాబాద్-పుణె హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఈ మూడు హైస్పీడ్ ప్రాజెక్టులకు కలిపి శంషాబాద్‌లో భారీ స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అనువైన భూమిని సైతం ఇప్పటికే గుర్తించింది. అయితే, పుణె నుంచి ముంబైకి ఇప్పటికే హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున.. మొత్తంగా దీన్ని హైదరాబాద్-ముంబై హై స్పీడ్ రైలు కారిడార్‌గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమోదించిన డీపీఆర్‌లో కోకాపేట స్టేషన్‌ను అదనంగా చేర్చినట్లు తెలిసింది. హైదరాబాద్-ముంబై హై స్పీడ్ రైలు మొత్తం 761 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 3 గంటలు. ప్రాజెక్టుకు రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2027-28లో నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. తాజా డీపీఆర్ ప్రకారం తెలంగాణలోని కోకాపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, వికారాబాద్, కర్ణాటకలోని కలబుర్గి, మహారాష్ట్రలోని సోలాపూర్, పండరీపూర్, బారామతి, పుణె, పింప్రి చిన్‌చౌడ్, లోనావాలా, నవీ ముంబై, థానే మీదుగా విక్‌రోలి వరకు హైస్పీడ్ రైలు ప్రయాణించనుంది.