Share News

మైనర్‌ నడిపిన కారు ఆర్‌సీ రద్దు !

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:00 AM

హైదరాబాద్‌లోని యూస్‌ఫగూడ కార్మికనగర్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో మైనర్‌ నడిపిన ఆ కారు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ)ను రద్దు చేయాలని రవాణశాఖ నిర్ణయించింది.

మైనర్‌ నడిపిన కారు ఆర్‌సీ రద్దు !

  • ఆ బాలుడికి 25 ఏళ్ల వరకు నో లైసెన్స్‌

  • రాష్ట్ర రవాణ శాఖ అధికారుల నిర్ణయం

  • యూస్‌ఫగూడ ఘటనపై ఆర్‌టీఏ విచారణ

  • ఎంవీఐకి బాధ్యతలు.. త్వరలో చర్యలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని యూస్‌ఫగూడ కార్మికనగర్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో మైనర్‌ నడిపిన ఆ కారు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ)ను రద్దు చేయాలని రవాణశాఖ నిర్ణయించింది. కారు నడిపిన బాలుడి (మైనర్‌)కి 25 ఏళ్ల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయకుండా చర్యలు తీసుకోనున్నారు. కార్మికనగర్‌లో మైనర్‌ నడిపిన కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం విదితమే. ఈ ఘటనను రవాణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఓ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)కు బాధ్యతలు అప్పగించింది. ఘటనాస్థలికి వెళ్లిన ఆ అధికారి వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికనూ ఉన్నతాధికారులకు సమర్పించారు. వాహనం ఆర్‌సీ, బీమా, పొల్యూషన్‌ ఇతరత్రా ఒరిజినల్‌ డాక్యుమెంట్లు సేకరించాలని ఉన్నతాధికారులు ఎంవీఐకి సూచించినట్టు తెలిసింది. ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో.. వారి నుంచి కూడా నివేదిక రవాణ శాఖకు రావాల్సి ఉంది. ఎంవీఐ ఒరిజినల్‌ డాక్యుమెంట్ల సేకరణ పూర్తయి, పోలీసుల నివేదిక వచ్చిన అనంతరం ఆర్‌సీని రద్దు చేస్తామని రవాణశాఖ హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ కే వెంకటరమణ తెలిపారు. ఆర్‌సీ రద్దు అమలులో ఉండే 12 నెలలు కారు పోలీస్ స్టేషన్‌/పోలీసుల ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకునే అవకాశముంది. అలాగే, 25 ఏళ్ల వరకు బాలుడికి లర్నర్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా సాంకేతికంగా చర్యలుతీసుకుంటామన్నారు. వాహన యజమానిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 05 , 2026 | 06:03 AM