Share News

రోగాల‘పాలు’

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:42 AM

ప్యాకెట్‌ పాలలో కల్తీ జరుగుతోందంటూ వస్తున్న వార్తలతో చాలా మంది ఖర్చు ఎక్కువైనా సరే నేరుగా ఆవు/గేదెల నుంచి పిండిన పాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

రోగాల‘పాలు’

  • హైదరాబాద్‌లో అమ్ముతున్న పశువుల పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు

  • అపరిశుభ్ర వాతావరణం, నీటి కాలుష్యం, కలుషిత దాణా వంటివి కారణం

  • ఆ పాల వల్ల పిల్లల్లో డయేరియా, పేగు సమస్యలు.. ఎదుగుదలపై ప్రభావం

  • ఎన్‌ఐఎన్‌, రాయల్‌ వెటర్నరీ కాలేజ్‌ తదితరుల అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): ప్యాకెట్‌ పాలలో కల్తీ జరుగుతోందంటూ వస్తున్న వార్తలతో చాలా మంది ఖర్చు ఎక్కువైనా సరే నేరుగా ఆవు/గేదెల నుంచి పిండిన పాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. కానీ.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అలాంటి పాలలో మల సంబంధిత బ్యాక్టీరియా, ఈస్ట్‌, సాల్మనెల్లా వంటివి కనిపిస్తున్నాయని.. అవి పిల్లల పేగుల్లో ఇన్ఫెక్షన్‌కు, డయేరియాకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాయల్‌ వెటర్నరీ కాలేజ్‌ (లండన్‌), లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, అంతర్జాతీయ పశుసంవర్ధక పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన ఈ అధ్యయనంలో.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించాయి. సాధారణంగా ఎక్కువమంది వాడే ప్యాకెట్‌ పాలు.. పాశ్చురైజ్డ్‌ పాలు. అంటే ఆ పాలను ప్యాకెట్‌లో పట్టే ముందు 71.7 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 15 సెకన్లపాటు వేడి చేసి వెంటనే 4 డిగ్రీలకు చల్లబరుస్తారు. ఆ పాలను పొంగు వచ్చేదాకా కాచి తాగితే సరిపోతుంది. కానీ.. పశువుల నుంచి సేకరించే పాలు పచ్చిపాలు. వాటిని పాశ్చురైజ్‌ చేయరు. ఆ పాలను మనం తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించి తాగాలి. ఒకసారి పొంగు వచ్చాక కూడా మరో ఐదు నిమిషాలపాటు సన్నని సెగ మీద ఉంచితేనే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.


ఈ విషయం తెలియక చాలా మంది వీటిని కూడా ప్యాకెట్‌ పాలలాగా ఒక పొంగు రాగానే కిందికి దించి వినియోగిస్తారు. ఆ పాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఎన్‌ఐఎన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన నివేదిక.. ద రాయల్‌ సొసైటీ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురిస్తున్న జర్నల్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా.. అడ్డగుట్ట, వారాశిగూడ ప్రాంతాల్లో 42 పాలనమూనాలు, 20 నీటి నమూనాలు, 24 పశువుల మేత నమూనాలను సేకరించి పరీక్షించారు. పాలలో 90.5ు నమూనాల్లో మల బ్యాక్టీరియా ఉందని, 95.2ు నమూనాల్లో ఈస్ట్‌, బూజు ఉందని తేలింది. అలాగే వాటిలో మూడో వంతు నమూనాల్లో సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాతో పాటుగా 31ు నమూనాలలో ఆహారాన్ని విషతుల్యం చేసే స్టెఫలోకోకస్‌ ఔరీస్‌ బ్యాక్టీరియా ఉందని, 12ు నమూనాలలో ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా కూడా ఉందని గుర్తించారు. ఇక.. 67ు పశువుల మేత నమూనాల్లో అఫ్లాటాక్సిన్‌లు ఉన్నట్లు గుర్తించారు. అఫ్లాటాక్సిన్‌లంటే.. అత్యంత ప్రమాదకరమైన సహజ విష పదార్ధాలు. ఇవి పశువుల దాణా, మొక్కజొన్న, వేరుశెనగ లలో ఎక్కువగా పెరుగుతాయి. పశువులు ఈ కలుషిత మేత తినడం వల్ల ఆ విషం పాలలోకి చేరుతుంది. ఆ పాలను సేవించడం ద్వారా మనుషులకూ అది చేరుతుంది. ఈ పాలను గర్భిణులు తాగితే.. పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉంటారని, వారిలో ఎదుగుదల సమస్యలుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యయనాలు వెల్లడిస్తుండటం గమనార్హం. అసలు మల బ్యాక్టీరియా పాలలోకి ఎలా చేరుతుందంటే.. నీటి ద్వారానే అని చెబుతున్నారు అధ్యయనకారులు.


ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

  • వినియోగదారులు వీలైనంత వరకూ ప్రభుత్వ ధ్రువీకృత ల్యాబ్‌లో పరీక్షలు చేయించిన సంస్ధ లేదంటే డెయిరీ ఫార్మ్‌లో మాత్రమే పాలు కొనాలి. ప్యాకెట్‌ పాలు అయినా ఇంటి వద్దనే పోసే డెయిరీ పాలు అయినా.. పది నిమిషాలు మరిగించిన తరువాతనే తాగడం మంచిది.

  • ఇక పశువులను పెంచేవారు.. అవి ఉండే షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. పాలు పితికే ముందు పొదుగులను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచాలి. పాలు పితికే వారు తమ చేతులను కూడా సబ్బుతో శుభ్రంగా కడిగిన తరువాతనే పొదుగు ముట్టుకోవాలి. పాల క్యాన్లు కడగటానికి క్లోరినేట్‌ చేసిన నీళ్లు మాత్రమే వాడాలి. ధర్మల్‌, బ్యాక్టీరియా పరీక్షలను అప్పుడప్పుడూ చేయించడం వల్ల వినియోగదారులలో నమ్మకం కలిగించవచ్చు.

Updated Date - Jul 13 , 2026 | 04:43 AM