Share News

1 నుంచి సర్కారీ మెట్రో

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:28 AM

హైదరాబాద్‌ మహానగరంలో ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న మెట్రో రైలు ప్రాజె క్టు కొద్ది రోజుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వపరం కానుంది.

1 నుంచి సర్కారీ మెట్రో

  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ.. 30లోగా ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం

  • జీవో 127 విడుదల చేసిన ప్రభుత్వం.. ఐఆర్‌ఎ్‌ఫసీ నుంచి 13,615 కోట్ల రుణం

  • 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఒప్పందం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరంలో ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న మెట్రో రైలు ప్రాజె క్టు కొద్ది రోజుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వపరం కానుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో నడవనుంది. ఈ నెల 30లోగా ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాజమాన్య బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ శుక్రవారం జీవో 127ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో మొదటిదశ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2012లో ప్రారంభించారు. ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేరకు నిర్మాణాన్ని ప్రతిపాదించి, 69.2 కిలోమీటర్ల మేర పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు కోసం తొలుత రూ.14,132 కోట్లతో అంచనాలు రూపొందించగా, 2017 నవంబర్‌లో నిర్మాణం పూర్తయ్యేనాటికి వ్యయం సుమారు రూ.18,800 కోట్లకు చేరింది. ప్రైవేట్‌, పబ్లిక్‌ భాగస్వామ్యం(పీపీపీ)లో ఈ ప్రాజెక్టును చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థ.. సొంతంగా 90 శాతం పెట్టుబడి పెటింది. మిగతా 10 శాతం ప్రభుత్వం గ్రాంటుగా అందించింది.


చేతులెత్తేసిన ఎల్‌ అండ్‌ టీ

మెట్రో రైళ్ల పరుగులు 2017 నవంబరులో ప్రారంభయ్యాయి. అప్పటి నుంచే ఎల్‌అండ్‌టీ నష్టాలతో సతమతవుతున్నట్లు చెప్తోంది. హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారంబాగ్‌లోని భూముల్లో ఎల్‌అండ్‌టీ మాల్స్‌ నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి రూ.13 వేల కోట్ల రుణం తీసుకున్న తమకు వడ్డీల భారం అధికమవుతోందని ఈ సంస్థ చెబుతోంది. మెట్రో నిర్వహణ కష్టంగా మారిందని, దీనిని ప్రభుత్వమే తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎల్‌ అండ్‌ టీతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మెట్రో స్వాధీనానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణంతోపాటు సదరు సంస్థ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రూ.13,615 కోట్ల రుణం తీసుకుంటోంది. మిగతా రూ.1,385 కోట్ల ఈక్విటీ మొత్తాన్ని హెచ్‌ఎండీఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ఈ రుణాన్ని మెట్రో రైలు సంస్థ 20 ఏళ్లలో తీరుస్తుందని జీవోలో పేర్కొన్నారు. గతంలో ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం రూ.900 కోట్ల వడ్డీలేని రుణం అందజేసింది. ఈ నెల 30 నాటికి దాని నికర ప్రస్తుత విలువ (ఎన్‌పీవీ) రూ.366.92 కోట్లు ఉంది. దీనిని ఎల్‌అండ్‌టీకి చేసే చెల్లింపుల్లో మినహాయించకుండా ఆ సంస్థ ఖాతాలో బకాయి రుణంగా కొనసాగించనుంది.


ఎల్‌అండ్‌టీ నుంచి ఇండెమ్నిటీ..!

స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖకు చెల్లించాల్సిన రూ.123.95 కోట్లు, కార్మికశాఖకు ఇవ్వాల్సిన లేబర్‌ సెస్‌ రూ.163.74 కోట్లు, టీజీఎస్పీడీసీఎల్‌కు కట్టాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.15.38 కోట్లు, జీహెచ్‌ఎంసీ ప్రకటనలకు ఇవ్వాల్సిన రూ.75.15 కోట్లకు సంబంధించి ఎల్‌అండ్‌టీ నుంచి నష్టపరిహార (ఇండెమ్నిటీ) బాండ్‌ తీసుకోవాలని జీవోలో ప్రభుత్వం సూచించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఎల్‌అండ్‌టీ కి ప్రాతినిధ్యం వహించేందుకు స్పెసిఫిక్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకోవాలని పేర్కొన్నారు. మెట్రోను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగించాలని జీవోలో తెలిపారు.

Updated Date - Apr 25 , 2026 | 06:29 AM