Share News

పాడ్‌ కార్‌లో పోదాం చలో చలో..

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:52 AM

గరంలో మెట్రో రెండో దశ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా పర్సనలైజ్డ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌....

పాడ్‌ కార్‌లో పోదాం చలో చలో..

  • మెట్రో రైళ్లకు అనుసంధానంగా.. రద్దీ ప్రాంతాల్లో అందుబాటులోకి

  • గత ప్రభుత్వంలో 2 మార్గాల్లో పీఆర్‌టీఎస్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు

  • ఇప్పుడు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో మెట్రో రెండో దశ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా పర్సనలైజ్డ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) రవాణాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఉండే ఆరు రద్దీ ప్రాంతాలకు.. అత్యంత అధునాతనమైన ఈ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈమేరకు.. ప్రతిపాదిత ప్రాంతాల్లో పీఆర్‌టీఎస్‌ వ్యవస్థ ఏర్పాటుకు కావాల్సిన కన్సల్టెంట్‌ ఎంపికకు ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. హైదరాబాద్‌ నగర రవాణాలో మెట్రో రైళ్లు కీలకంగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దశ మెట్రో పరిధిలో రోజుకు 4.8 లక్షల మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ.. నిర్ణీత మెట్రో స్టేషన్‌లో దిగిన తర్వాత, ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ఆఫీసులకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైలు దిగిన తర్వాత.. ఉద్యోగులు వెంటనే ప్రత్యేక పాడ్‌ కార్లలో తమ తమ ఆఫీసులకు సులువుగా వెళ్లేందుకు పీఆర్‌టీఎస్‌ రవాణా వ్యవస్థ ఎంతో దోహదపడనుంది. డ్రైవర్‌ రహితంగా ఉండే ఈ కార్లలో వెళ్లి కూర్చుంటే వెళ్లాల్సిన చోటుకు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.


గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు..

మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా పీఆర్‌టీఎస్‌ ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరంలోని రెండు మార్గాలను ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని.. కారిడార్‌-3లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలోని మైండ్‌స్పేస్‌, ఇనార్బిట్‌ మాల్‌, అరబిందో, నాలెడ్జ్‌ సిటీ, మైహోం భూజ, ఐటీసీ కోహినూర్‌ వరకూ ప్రతిపాదించారు. అలాగే కారిడార్‌-2లో జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గంలో ట్రాఫిక్‌ తీవ్రత ఎక్కువగా ఉండే అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్‌ మెట్రోస్టేషన్‌ వరకు 10 కిలోమీటర్ల మేర పాడ్‌కార్లను నడిపించాలని భావించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. ఈమేరకు.. అలా్ట్ర పీఆర్‌టీ లిమిటెడ్‌తో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (ఎంహెచ్‌ఎఆర్‌ఎల్‌) ఎంవోయూ కుదుర్చుకున్నట్లు 2022 వార్షిక నివేదికలో కూడా వెల్లడించారు. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులపై అప్పటి సర్కారు సరైన ఆసక్తి చూపించకపోవడం, కేంద్రంతో సఖ్యత లేని కారణంగా.. అడుగు ముందుకు పడలేదనే విమర్శలున్నాయి.

ఈ ప్రభుత్వంలో..

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు.. మెట్రో రెండో దశ విస్తరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి, పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ కింద మొత్తం 162.5 కిలోమీటర్లలో 8 కారిడార్లను రూ.43,848 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమైంది. మొత్తం ప్రాజెక్టును 50:50 జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇదే సమయంలో నగరంలో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతాలకు అవసరమయ్యే పీఆర్‌టీఎస్‌ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సచివాలయం, నాలెడ్జ్‌ సిటీ, రాయదుర్గ్‌, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ల పరిసరాలు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, రాయదుర్గ్‌-కూకట్‌పల్లి కారిడార్‌ ప్రాంతాల్లో ఆటోమేటెడ్‌/పీఆర్‌టీఎస్‌ అభివృద్ధికి టెక్నో-ఎకనమిక్‌ ఫీజిబిలిటీ స్టడీ, డిజైన్‌ బిడ్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 24న హెచ్‌ఎంఆర్‌ఎల్‌ 2439 టెండర్‌ నోటీసు జారీ చేసింది. బిడ్ల సమర్పణకు తుది గడువు మార్చి 25. అర్హత ప్రమాణాలు, పనుల పరిధి, ఇతర వివరాల కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది.ఈ ప్రాజెక్టును డిజైన్‌, బిల్ట్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎ్‌ఫఓటీ) విధానంలో ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌ ద్వారా అమలు చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ నిర్ణయించింది.


పాడ్‌ కారు ఎలా నడుస్తుందంటే..

పీఆర్‌టీఎస్‌ వ్యవస్థకు.. మెట్రో మాదిరిగా ఎంపిక చేసిన ప్రాంతంలో రోడ్డు పక్కన ఎలివేటెడ్‌ ట్రాక్‌ ఉంటుంది. ఆ ట్రాక్‌ మీద పాడ్‌ కార్లు ఉంటాయి. ఇవి నానో కారు తరహాలో చిన్నగా ఉంటాయి. ఒక పాడ్‌ కారులో నలుగురి నుంచి ఆరుగురి దాకా ప్రయాణించవచ్చు. లోపల డ్రైవర్‌ ఉండడు. ఈ కార్లు విద్యుత్‌తో నడుస్తుంటాయి. స్టేషన్ల వివరాలు.. పాడ్‌ కారులోని కంప్యూటర్‌ స్ర్కీన్‌పై కనిపిస్తుంటాయి. ఎంపిక చేసిన స్టేషన్లలో అవి ఆగుతాయి. రద్దీ మార్గాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరమే ఇవి నడుస్తాయి. ఈ పాడ్‌కార్‌ వ్యవస్థను ఉత్తరప్రదేశ్‌లో, బెంగళూరులో ఇప్పటికే ప్రతిపాదించారు.

Updated Date - Feb 26 , 2026 | 02:52 AM