Share News

మెట్రో రైలుకు ‘స్వదేశీ’ బోగీలు

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:53 AM

హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు మరికొన్ని నెలల్లో 60 కొత్త బోగీలు రానున్నాయి. ‘మేకిన్‌ ఇండియా- మేడిన్‌ ఇండియా’ నినాదంలో భాగంగా దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి ఈ బోగీలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మెట్రో రైలుకు ‘స్వదేశీ’ బోగీలు

  • భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌కు బోగీల తయారీ బాధ్యతలు

  • కన్సల్టెంట్‌గా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌

  • సర్కారు ఆదేశాలతో అధికారుల కసరత్తు

  • 1200 కోట్లతో 60 కోచ్‌ల కొనుగోలు

  • ఇందుకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు

  • ప్రస్తుత మెట్రో రైళ్లన్నీ దక్షిణ కొరియావే..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు మరికొన్ని నెలల్లో 60 కొత్త బోగీలు రానున్నాయి. ‘మేకిన్‌ ఇండియా- మేడిన్‌ ఇండియా’ నినాదంలో భాగంగా దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి ఈ బోగీలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా కంపెనీని ఎంపిక చేసి బోగీలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్‌ మెట్రో తొలిదశ ప్రాజెక్టు 2017 నవంబరులో అందుబాటులోకి వచ్చింది. 69.2 కిలోమీటర్ల పొడవున ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ప్రస్తుతం రోజుకు 1,200 ట్రిప్పుల్లో సగటున 4.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. క్రమంగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీంతో 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేసి మెట్రో రైళ్లకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 57 రైళ్లు ఒక్కోటీ 3 బోగీలతో నడుస్తున్నాయి. ఇకపై మరో కోచ్‌ను అదనంగా జతచేయనున్నారు. ఒక్కో కోచ్‌కు సుమారు రూ.20 కోట్ల చొప్పున 60 బోగీలకు రూ.1,200 కోట్లు ఖర్చవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక నిధులు సమకూర్చనున్నట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.


‘బీఈఎంఎల్‌’కు తయారీ బాధ్యతలు!

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మెట్రో కోచ్‌ల తయారీ సంస్థలున్నాయి. బెంగళూరులో భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌), ఆల్‌స్టామ్‌, కోల్‌కతాలో టైటాగఢ్‌ రైల్‌ సిస్టమ్‌, చెన్నై పెరంబూర్‌లో ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌), ఏపీలోని శ్రీసిటీలో ఉన్న చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ (సీఆర్‌ఆర్‌సీ) ప్లాంటు వాటిలో ముఖ్యమైనవి. ఇందులో మెట్రో టెక్నాలజీలో విశేష అనుభవమున్న ‘బీఈఎంఎల్‌’కు బోగీల ఆర్డర్‌ ఇవ్వాలని హైదరాబాద్‌ మెట్రోకు ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లోని మెట్రోలకు ఈ సంస్థ బోగీలను తయారు చేసి అందించింది కూడా. బీఈఎంఎల్‌ నుంచి కోచ్‌ల కొనుగోలు కోసం కన్సల్టెన్సీ (మధ్యవర్తి)గా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

8 నుంచి 10 నెలల్లో అందుబాటులోకి!

ప్రస్తుతమున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లను దక్షిణ కొరియాలోని హ్యుందాయ్‌ రోటెమ్‌ కంపెనీ తయారు చేసింది. ‘కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ)’ సాంకేతికతతో ఆటోమేటిగ్గా రైళ్లు నడిచేలా వాటిని రూపొందించారు. రైలులో ఉండే లోకోపైలెట్లు కేవలం సిగ్నలింగ్‌ను, బోగీల్లోకి ప్రయాణికుల రాకపోకలను మాత్రమే గమనిస్తుంటారు. మిగతా అంతా సీబీటీసీతోనే నడుస్తోంది. ఇప్పుడు కొత్త కోచ్‌లను కూడా ఇదే వ్యవస్థకు అనుసంధానం అయ్యేలా రూపొందించనున్నారు. దీనిపై బీఈఎంఎల్‌ సంస్థతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే 8-10 నెలల్లో కొత్త బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 05:54 AM