Hyderabad Metro: త్వరలో మెట్రోకు కొత్త కోచ్‌లు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:17 AM
హైదరాబాద్ మెట్రోకు త్వరలోనే కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 బోగీలతో కూడిన పది రైలు సెట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.....
60 బోగీలను తెచ్చేందుకు హెచ్‌ఎంఆర్ ఏర్పాట్లు.. మొత్తం పది రైలు సెట్ల కొనుగోలుకు నిర్ణయం
ఇప్పటికే సర్కారుకు అధికారుల ప్రతిపాదనలు
అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల నిర్వహణ
రూ.650-700 కోట్ల వరకు వెచ్చించే అవకాశం
హైదరాబాద్ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రోకు త్వరలోనే కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 బోగీలతో కూడిన పది రైలు సెట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెట్రో రైళ్లు మూడు కోచ్‌లతో నడుస్తుండగా మరికొద్ది రోజుల్లో 6 బోగీలతో నడిపించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ఆమోదించిన వెంట నే టెండర్లు నిర్వహించి కొనుగోలు చేస్తామని హెచ్‌ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎ్‌స-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో ప్రస్తుతం రోజుకు 1,200 ట్రిప్పులను నడిపిస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతోంది.
కొత్త కోచ్‌లకు నాలుగేళ్లుగా ఎదురుచూపులు
పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలను తీసుకొస్తామని నాలుగేళ్ల క్రితం ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రకటించారు. ఏడాదిలోపు 4 నుంచి 7 కొత్త రైళ్లను (మూడు కోచ్‌లతో) కచ్చితంగా తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి 2024 నవంబరులో చెప్పారు. కొత్త రైళ్ల కొనుగోలు సాధ్యపడకుంటే కనీసం 40-70 వరకు కోచ్‌లనైనా తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతామని ఏడాది క్రితం చెప్పారు. ఇప్పటి వరకు అమలు కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రోలో కాలుపెట్టలేని పరిస్థితి ఉంటోంది. కాగా, నష్టాలతో సతమతమవుతున్న ఎల్‌అండ్‌టీ.. మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామని కొన్ని నెలల క్రితం ప్రకటించింది. దీంతో ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మెట్రో యాజమాన్య బదిలీ ప్రక్రియను శరవేగంగా చేపడుతోంది. కాగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నివేదిక మరో పది రోజుల్లో పూర్తవుతుందని, అయితే స్వాధీన ప్రక్రియకు సమాంతరంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
తయారీ సంస్థలతో సంప్రదింపులు
నగరంలో మొదటి దశలో నడుస్తున్న రైళ్లు ప్రస్తుతం 57 ఉన్నాయి. 171 కోచ్‌లతో కూడిన ఆయా రైళ్లు మూడు కారిడార్లలో తిరుగుతున్నాయి. అయితే 6 బోగీలతో కూడిన రైళ్లు నిలిచేలా మొదట్లోనే ప్లాట్‌ఫామ్‌లను నిర్మించడంతో ఇప్పుడు ఆ మాదిరి కొత్త సెట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 10 కొత్త రైళ్లను(60 బోగీలు) అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు బెంగళూరులోని భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్(బీఈఎంల్), చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), తదితర సంస్థలను హెచ్‌ఎంఆర్ అధికారులు సంప్రదించారు. కాగా, 6 బోగీలతో కూడిన ఒక్కో సెట్‌కు సుమారు రూ.65-70 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. 10 కొత్త రైళ్లకు రూ.650-700 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
రుణాలు ఇచ్చే సంస్థల కోసం అన్వేషణ
ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదే క్రమంలో ఆ సంస్థకు ఇచ్చే ఈక్విటీ వాటా రూ.2వేల కోట్లతో పాటు రుణాల కింద ఉన్న రూ.13వేల కోట్లను తక్కువ వడ్డీ తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకులను సంప్రదిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలను తీసుకుని వాటిని సులువుగా చెల్లిస్తూ మెట్రోను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా నగర రవాణాలో అతి కీలకమైన మెట్రోకు కొత్త రైళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.