Share News

మెట్రో రుణం అగ్గువకే..!

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:55 AM

హైదరాబాద్‌ మెట్రో రైలును స్వాధీనం చేసుకున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. అందుకు చెల్లించాల్సిన నిధులను ఎంత శాతం వడ్డీకి తీసుకు వస్తోందో తెలుసా!? కేవలం 4.5 శాతం మాత్రమే!

మెట్రో రుణం అగ్గువకే..!

  • 4.5శాతం వడ్డీకే రూ.15 వేల కోట్లు తెస్తున్న ప్రభుత్వం.. రుణం ఇవ్వడానికి ఐఆర్‌ఎ్‌ఫసీ ఓకే

  • గత రుణాలతో పోలిస్తే ఇప్పుడు తెచ్చేది సగం కంటే తక్కువ శాతం వడ్డీకే

  • ఇప్పటి నిర్మాణ ధరతో పోలిస్తే తక్కువకే స్వాధీనం

  • ఎల్‌అండ్‌టీకి అప్పట్లో ఇచ్చిన 120 ఎకరాలూ సర్కారుకే

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలును స్వాధీనం చేసుకున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. అందుకు చెల్లించాల్సిన నిధులను ఎంత శాతం వడ్డీకి తీసుకు వస్తోందో తెలుసా!? కేవలం 4.5 శాతం మాత్రమే! మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ గతంలో 8 శాతానికి అప్పు తెస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్‌ ప్రభుత్వం 9.45 శాతం నుంచి 10.90 శాతం మధ్య వడ్డీకి రూ.87,449కోట్ల రుణాలు తీసుకుంది. వాటితో పోలిస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సగానికంటే తక్కువ వడ్డీకే రుణం తీసుకోనుంది. ఈ రుణం ఇచ్చేందుకు భారతీయ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌ఫసీ) అంగీకరించింది కూడా. మెట్రో ఫేజ్‌-1ను ఎల్‌ అండ్‌ టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మెట్రో నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వమే బదలాయించుకుంటుంది. అలాగే, మెట్రోకు ఎల్‌అండ్‌టీ తన సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టిన సొమ్ముతోపాటు మెట్రో రైల్‌ను వదులుకుంటున్నందుకు మరో రూ.2000కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్మును నేరుగా ఎల్‌అండ్‌టీకి చెల్లిస్తుంది. అంటే, మెట్రో రైలును స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం సొమ్ము రూ.15వేల కోట్లు.


ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ఎ్‌ఫసీ నుంచి రుణంగా తీసుకోనుంది. దీనిపై వడ్డీ సుమారు 4.5 శాతమే ఉండనుంది. ఎల్‌అండ్‌టీతో పోల్చినా.. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులతో పోల్చినా ఇప్పుడు మెట్రో రైలుకు రేవంత్‌ రెడ్డి సర్కారు తీసుకునే రుణానికి వడ్డీ శాతం చాలా తక్కువని, ఇది ప్రభుత్వానికి లాభదాయకంగా మారుతుందని మెట్రో రైల్‌ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంపై భారం తగ్గుతుందని వివరిస్తున్నారు. నిజానికి, రూ.15 వేల కోట్లు పెట్టి ఒక ప్రైవేటు ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు దేశంలోనే లేవని, సదరు ప్రాజెక్టుకు అత్యంత తక్కువ వడ్డీకే నిధులు సమకూరడం ఒక రికార్డని అధికార వర్గాలు చెబుతున్నాయి.


సర్కారుకు డబుల్‌ బొనాంజా!

ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైల్‌ను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రానికి లాభదాయకమేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. మొదటి దశ మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొత్తం 61 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు తీసుకుంటోంది. అంటే, ఒక్కో కిలోమీటరుకు రూ.246 కోట్లు అవుతోంది. అదే.. రెండో దశ డీపీఆర్‌ ప్రకారం ఇప్పుడు ఒక కిలోమీటరు మెట్రో రైలును నిర్మించాలంటే రూ.350 కోట్లు అవుతుందని అంచనా. అంటే, 61 కిలోమీటర్లకు రూ.21,350 కోట్లు ఖర్చవుతుంది. దీనితో పోలిస్తే.. ఎల్‌అండ్‌టీ నుంచి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ను ప్రభుత్వం చాలా చౌక ధరకే తీసుకున్నట్లు అవుతుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అంతేనా.. మెట్రో రైల్‌ నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం భారీగా భూములు ఇచ్చింది. మెట్రో స్టేషన్ల దగ్గర కట్టిన మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతోపాటు ఖాళీ భూములన్నీ ప్రభుత్వానికే దఖలు పడనున్నాయి. మెట్రో నిర్మాణ సమయంలో స్టేషన్లు, డిపోలకు కాకుండా వాణిజ్య అవసరాల కోసం ఎల్‌అండ్‌టీకి 120 ఎకరాలను ఇచ్చారు. ఎల్‌అండ్‌టీ ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకుని దానిద్వారా ఆదాయాన్ని పొందేలా చేశారు. ఇందులో 49 ఎకరాల్లో మాత్రమే ఎల్‌అండ్‌టీ సంస్థ మాల్స్‌ నిర్మించి అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు ఆ మాల్స్‌తోపాటు ఇంకా అభివృద్ది చేయకుండా ఉన్న 71ఎకరాలు కూడా ప్రభుత్వానికే చెందుతుంది. అయితే, ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆస్తులను వేలం వేయడానికి వీలుండదు. ఎందుకంటే, ఆ ఆస్తులను తనఖా పెట్టినందునే ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ఇస్తుంది. అందుకే, ఐఆర్‌ఎ్‌ఫసీకి తనఖా పెట్టగా మిగిలిన భాగాన్ని అవసరమైతే వేలం వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


కియోలిస్‌కే నిర్వహణ బాధ్యత కొనసాగింపు

మెట్రో రైల్‌ మొదటి దశను ఎల్‌అండ్‌టీ పూర్తి చేసి ఉపయోగంలోకి తెచ్చిన నాటి నుంచి.. దాని నిర్వహణ బాధ్యతను ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్‌ కంపెనీ చూస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే సంస్థకు నిర్వహణ బాధ్యతను కొనసాగించనుంది. ఈ ఏడాది నవంబరు వరకు ఆ సంస్థకే నిర్వహణ కాంట్రాక్టు ఉండగా.. ఆ తర్వాత కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Mar 15 , 2026 | 06:57 AM