Share News

మెట్రోకు అప్పు దొరికింది!

ABN , Publish Date - May 26 , 2026 | 05:08 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రూ.13,600 కోట్ల భారీ నిర్వహణ మూలధన మార్పిడి (వర్కింగ్‌ క్యాపిటల్‌ రీఫైనాన్సింగ్‌) రుణాన్ని దక్కించుకుంది.

మెట్రోకు అప్పు దొరికింది!

  • 13,600 కోట్లు అప్పు ఇచ్చిన రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

  • ఇరవై సంవత్సరాల పాటు త్రైమాసిక చెల్లింపులు

  • ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ సంతకాలు

  • ఆ నిధులతో ఎల్‌అండ్‌టీ తెచ్చిన అప్పులు తీరుస్తారు

  • 2-3 రోజుల్లో ఎల్‌అండ్‌టీకి రూ.1,400 కోట్ల చెల్లింపు

  • జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మెట్రో

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రూ.13,600 కోట్ల భారీ నిర్వహణ మూలధన మార్పిడి (వర్కింగ్‌ క్యాపిటల్‌ రీఫైనాన్సింగ్‌) రుణాన్ని దక్కించుకుంది. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌ఎ్‌ఫసీ) ఈ రుణాన్ని మంజూరు చేయనుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఐఆర్‌ఎ్‌ఫసీ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ల మధ్య ఈ చరిత్రాత్మక రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎ్‌ఫసీ సీఎండీ మనోజ్‌ కుమార్‌ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టుపై ఉన్న నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్లు, కమర్షియల్‌ పేపర్లు, వర్కింగ్‌ కాపిటల్‌ తదితర అధిక వడ్డీ రుణాలను తీర్చేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. పాత రుణదాతలకు క్రమబద్థమైన ఎగ్జిట్‌ కల్పిస్తూ తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌తో దీనిని భర్తీ చేస్తారు. రుణాన్ని 20 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో తిరిగి చెల్లించే విధంగా రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నిర్బంధ చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో పాటు ఆర్‌బీఐ మద్దతుతో కూడిన ‘డైరెక్ట్‌ డెబిట్‌ మాండేట్‌’ వంటి బలమైన రక్షణ వ్యవస్థలు ఈ లావాదేవీకి అండగా నిలిచాయి.


ప్రభుత్వ యాజమాన్య ఆస్తిగా మెట్రో: సీఎస్‌

మెట్రో ఇక పూర్తి ప్రభుత్వ యాజమాన్య ఆస్తిగా మారిందని సీఎస్‌ కె.రామకృష్ణారావు తెలిపారు. ఎల్‌ అండ్‌ టీ నుంచి మెట్రో రైల్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌ఎంఎల్‌) ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్‌ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యూహాత్మక ప్రజా రవాణా ఆస్తిగా మారిందన్నారు. హైదరాబాద్‌లో సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ భారీ రీఫైనాన్సింగ్‌తో మెట్రోపై ప్రస్తుత రుణ భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఇది భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రణాళికలకు, కొత్త కారిడార్ల నిర్మాణానికి బలమైన ఆర్థిక పునాదిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 69.2 కిలోమీటర్ల పొడవు, 3 కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మొదటిదశ దేశంలోనే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంలో నిర్మించిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు.


3 రోజుల్లో ఎల్‌ అండ్‌ టీకి చెల్లింపులు

అప్పుల ఒప్పందంపై సంతకాలతో ఎల్‌ అండ్‌ టీ మెట్రో కాస్తా ప్రభుత్వ మెట్రోగా మారింది. రూ.1400 కోట్ల ఈక్విటీ వాటాను ఎల్‌ అండ్‌ టీ ఖాతాలో రెండు, మూడు రోజుల్లో జమ చేస్తారు. నిజానికి మెట్రో నుంచి తప్పుకుంటానని ఎల్‌ అండ్‌ టీయే ప్రతిపాదించింది. ఏప్రిల్‌ 29న ఎల్‌అండ్‌టీ వాటాల విక్రయంపై సంతకాలు జరిగాయి. మెట్రో రైలు నిర్వహణకు ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు రూ.13,500 కోట్ల రుణం తీసుకుంది. ఎల్‌ అండ్‌ టీకి చెల్లించాల్సిన మొత్తం కలుపుకొని రూ.15,000 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్సింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ఎ్‌ఫసీని కోరింది. రూ.13,615 కోట్లను చెల్లించేందుకు ప్రాథమికంగా అంగీకరించిన కార్పొరేషన్‌ చివరకు రూ.13,600 కోట్లకు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని మూడు పార్టీల భాగస్వామ్యం ఉన్న ఎస్ర్కో ఖాతాలో వేస్తారు. మెట్రో ఆస్తులన్నీ లెక్కజెప్పి ప్రభుత్వానికి అప్పజెప్పిన తర్వాత ఆ నిధులను ఎల్‌ అండ్‌ టీకి అప్పగిస్తారు. అది బాకీలన్నీ తీర్చుకుంటుంది. జూన్‌ 1 నుంచి హైదరాబాద్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌హెచ్‌ఎల్‌) బోర్డు ప్రభుత్వం తరఫున కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. మెట్రో రైల్‌ నిర్వహణ కార్యకలాపాలపై బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ప్రతి రెండు నెలలకోసారి సమావేశమయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్‌అండ్‌టీ ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకుంటారు. ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ బోర్డులో ఎల్‌ అండ్‌ టీ పేరును తొలగిస్తారని అంటున్నారు. మెట్రో రెండో దశలో పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ కింద 162.5 కిలోమీటర్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వరకు చేపట్టనున్న 39.6 కిలోమీటర్లను రెండో దశ నుంచి తొలగించి మూడో దశలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేందాన్ని కోరింది. దీంతో రెండో దశ ఏడు కారిడార్లు 122.9 కిలోమీటర్లకు పరిమితం కానుంది. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట కారిడార్‌ పనులను వెంటనే ప్రారంభిస్తారు.

Updated Date - May 26 , 2026 | 05:08 AM