భూమి లోపల, పైన, ఆకాశంలో..3 మార్గాల్లో మెట్రో రైలు మూడో దశ
ABN , Publish Date - May 07 , 2026 | 05:22 AM
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో కీలకమైన స్కిల్ యూనివర్సిటీ (ఫ్యూచర్ సిటీ) కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అత్యాధునికంగా ఎయిర్‌పోర్టు- ఫ్యూచర్‌సిటీ కారిడార్
భూమిపై 18 కిలోమీటర్లు, అండర్‌గ్రౌండ్‌లో 2 కిలోమీటర్లు
20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్
ఫేజ్-3 కింద చేపట్టాలని కేంద్రానికి సీఎం వినతి
హైదరాబాద్ సిటీ, మే6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో కీలకమైన స్కిల్ యూనివర్సిటీ (ఫ్యూచర్ సిటీ) కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మొదలయ్యే ఈ మార్గాన్ని భూమి లోపల, ఉపరితలంపై, ఆకాశంలో వెళ్లేలా నిర్మించాలని ప్రతిపాదించారు. 40 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లోనే చేరుకునేలా డిజైన్ చేశారు. ప్రధానంగా ఈ మార్గంలో 18 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ రహదారి మధ్యలో భూమిపై (ఎట్‌గ్రేడ్)నే రైలు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించారు. మెట్రో రెండో దశలోని పార్ట్-ఏలో ఉన్న 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) 4 నెలల క్రితమే కేంద్రానికి పంపించింది. అయితే, రెండో దశలో ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు-స్కిల్ వర్సిటీ మార్గాన్ని ఫేజ్-3 కింద చేపట్టాలని సీఎం రేవంత్ తాజాగా కేంద్రమంత్రి ఖట్టర్‌ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కారిడార్ వెళ్లేది ఇలా..!
ఈ కారిడార్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ నుంచి మొదలై.. కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైలుడిపో పక్క నుంచి ఎయిర్‌పోర్టు సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్‌పల్లి రోడ్డు గుండా 6 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌కి చేరుతుంది.
ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్‌పోర్టు కార్గో వరకు 2 కిలోమీటర్ల దూరం అండర్‌గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. కార్గోస్టేషన్ వద్ద డిపోను ఏర్పాటు చేయనున్నారు.
పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాలఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఎలివేటెడ్ కారిడార్‌గా కొనసాగుతుంది.
రావిర్యాలఎగ్జిట్ నుంచి కొంగరకలాన్, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడా, మీర్‌ఖాన్‌పేట్ మీదుగా స్కిల్ యూనివర్సిటీ వరకు హెచ్‌ఎండీఏ సంస్థ 100 మీటర్ల వెడల్పున నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్ల (72 అడుగులు) ప్రదేశాన్ని మెట్రో రైలుకుకేటాయించారు. ఈ మార్గంలో రోడ్డు మధ్యలో మెట్రో రైలు భూమిపై 18 కిలోమీటర్లు పరుగులు పెట్టనుంది.
విశాలమైన రోడ్డు మధ్యలో.. అదే లెవెల్‌లో మెట్రో రైలు లైన్ ఉంటుంది. దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను, రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లతో గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. అలాగే, ప్రధాన రహదారికి ఇరువైపులా మళ్లీ రెండు సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ఈ కారిడార్‌లో మొత్తం 16 స్టేషన్లు ఉంటాయి.