కేంద్ర ప్రభుత్వంపైనే భారం!
ABN , Publish Date - May 04 , 2026 | 04:56 AM
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవటంతో.. ఇప్పుడు అందరి దృ ష్టి రెండో దశ ....
మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సహకారం కీలకం
డీపీఆర్ ఆమోదం, నిధుల సమీకరణకు చేయూత అవసరం
18శాతం వాటా నిధులతోపాటు 48శాతం రుణాలకు పూచీకత్తు
మొదటి దశ టేకోవర్‌తో రెండో దశకు ఎదురుచూపులు
ఆలస్యం చేస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగే ప్రమాదం
హైదరాబాద్ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవటంతో.. ఇప్పుడు అందరి దృ ష్టి రెండో దశ ప్రాజెక్టుపై పడింది. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌లో 100 శాతం వాటాలను విక్రయించినట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రతిపాదిత రెండో దశ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు రెండో దశ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను కేంద్రం ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. మొదటి దశకు అనుసంధానంగా రెండో దశలో మొత్తం 8 కారిడార్లతో కొత్తగా 162.5 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని పార్ట్-ఏ, పార్ట్-బీగా విభజించారు. ఇందులో కారిడార్-4 కింద నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్-9 కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్ ఫ్యూచర్‌సిటీ వరకు 39.6 కిలోమీటర్ల కారిడార్లు అతిపెద్దవి. నాగోల్ నుంచి ఫ్యూచర్‌సిటీకి ఒకే రైలులో నేరుగా 76.4 కిలోమీటర్లు ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు.
కేంద్రం సహకారం కీలకం
మెట్రో మొదటి దశ ఎల్‌అండ్‌టీ చేతిలో ఉండటం, రెండో దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించటంతో రెండింటి మధ్య సమన్వయం, నిర్వహణలో తేడా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండో దశ డీపీఆర్‌లకు ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. తాజాగా మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవటంతో అందరి దృష్టి కేంద్రం వైపు మళ్లింది. డీపీఆర్‌లకు అనుమతి ఇవ్వడంతోపాటు తన వాటా నిధుల విడుదల, బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సావరిన్ గ్యారంటీ ఇచ్చి కేంద్రం సహకారం అందించాల్సి ఉంది.
రెండో దశలో పార్ట్-ఏలోని 5 కారిడార్ల (76.4 కిలోమీటరు) నిర్మాణానికి రూ.24,269 కోట్లు, పార్ట్-బీలోని 3 కారిడార్ల (86.1 కిలోమీటర్లు)కు రూ.19,579 కోట్లు కలిపి మొత్తం రూ.43,848 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును 50:50 జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిర్ణయించాయి. ఇందులో 18 శాతం నిధులను కేంద్రం తన వాటా కింద అందించాల్సి ఉంది. మొత్తం వ్యయంలో 48 శాతం రుణంగా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ)ల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రుణాలకు కేంద్రం సావరిన్ గ్యారంటీ (పూచీకత్తు) ఇవ్వాలి. ఈ పనులు ఎంత త్వరగా పూర్తియితే రెండో దశ అంత వేగంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన కారిడార్లకు అనుమతి ఇవ్వాలని గత సెప్టెంబర్, నవంబర్ నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి ఇవ్వటంలో కేంద్రం ఆలస్యం చేస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కిలోమీటరుకు రూ.269.83 కోట్లు ఖర్చు అవుతందని ప్రస్తుతం అంచనా వేశారు. డీపీఆర్ ఆమోదంలో జాప్యం జరిగితే అది రూ.300 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.