Share News

కిలోమీటరుకు 314 కోట్లు..!

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:20 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగిపోతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన డీపీఆర్‌ ప్రకారం ఒక కిలోమీటరు నిర్మాణానికి రూ.269.83 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

కిలోమీటరుకు 314 కోట్లు..!

  • భారీగా పెరిగిపోతున్న మెట్రో రైలు ఫేజ్‌-2 అంచనా వ్యయం

  • పాత డీపీఆర్‌తో పోల్చితే వ్యయం రూ.1,915 కోట్లకు పైగా పెరుగుదల

  • తాజా సవరణలు, భూసేకరణ, ఇతర పనుల్లో జాప్యమే ప్రధాన కారణాలు

  • సెప్టెంబరు వరకు మెట్రో నిర్వహణ భారం ఎల్‌అండ్‌టీదే

హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగిపోతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన డీపీఆర్‌ ప్రకారం ఒక కిలోమీటరు నిర్మాణానికి రూ.269.83 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది పంపిన డీపీఆర్‌ ప్రకారం కిలోమీటరుకు రూ.314 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రం సూచనల మేరకు డీపీఆర్‌లో చేసిన సవరణలు త్వరగా పూర్తి కాకుంటే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రెండో దశలో పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ కింద మొత్తం 8 కారిడార్లతో 162.5 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందుకోసం కిలోమీటరుకు రూ.269.83 కోట్ల చొప్పున రూ.43,848 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టును 50:50 నిష్పత్తిలో జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. పార్ట్‌-ఏకు సంబంధించిన డీపీఆర్‌ను 2024 నవంబరు 4న, పార్ట్‌-బీ డీపీఆర్‌ను 2025 జూలైలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌ ప్యూచర్‌సిటీ వరకు 39.6 కిలోమీటర్ల కారిడార్‌ను మూడో దశగా విడదీశారు. దీంతో 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ.36,680 కోట్ల అంచనా వ్యయంతో సవరించిన డీపీఆర్‌ను ఈ ఏడాది కేంద్రానికి పంపారు. దాని ప్రకారం ఒక్కో కిలోమీటరు నిర్మాణానికి రూ.298 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కానీ, కేంద్రం సూచనల మేరకు మెట్రో రైలు అధికారులు తాజాగా చేస్తున్న సవరణలతో ప్రాజెక్టు అంచనా వ్యయం మరో రూ.1,915 కోట్లు పెరిగి రూ.38,595 కోట్లకు చేరింది. ఈ లెక్కన కిలోమీటరుకు ఖర్చు రూ.314 కోట్లకు చేరుకుంది. భూసేకరణలో జాప్యం, అలైన్‌మెంట్లలో మార్పులతోనే నిర్మాణ అంచనా వ్యయం పెరిగినట్లు తెలిసింది. కాగా, రెండో దశకు సంబంధించిన అంచనాల మదింపు కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఏర్పాటు చేస్తామని, గతంలో ఐడీబీఐ క్యాపిటల్‌ చేసిన అధ్యయనాన్ని ఈ సంస్థ పరిశీలిస్తుందని చెప్పిన కేంద్రం.. ఇప్పటివరకు దానిపై దృష్టి సారించలేదు. ఎస్‌బీఐ క్యాప్స్‌ త్వరగా ఏర్పాటు కాకుంటే అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంటున్నారు.


సెప్టెంబరు వరకు ఎల్‌అండ్‌టీ చేతిలోనే మెట్రో..

మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకున్నా.. మరికొంత కాలం దానిని ఎల్‌అండ్‌ టీ సంస్థే నిర్వహించాల్సి వస్తోంది. ప్రాజెక్టు టేకోవర్‌ కోసం ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రావాల్సిన రుణం ఆగిపోవడం, రెండోదశ కారిడార్ల డీపీఆర్‌ ఆమో దం కోసం మరోసారి అధ్యయనం చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ సంస్థ మరికొంత కాలం నిర్వహించక తప్పదని అధికారులు తెలిపారు. దాదాపు రూ.15 వేల కోట్లతో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసిన విష యం తెలిసిందే. ఇందులో ఎల్‌అండ్‌టీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13,600 కోట్ల అప్పును తన పేరిట బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ 29న షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ) చేసుకుంది. మిగతా రూ.1,400 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి చెల్లించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ, కేంద్రం పూచీకత్తుపై ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణం రూ.13,600 కోట్లు జూన్‌ 15న రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమకావాల్సి ఉండగా.. జమకాలేదు. దీంతో ఎస్‌పీఏను సెప్టెంబరు వరకు పొడిగించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఎల్‌అండ్‌టీ సంస్థ నెలకు రూ.70 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఎస్‌పీఏను పొడిగించటంతో సెప్టెంబరు వర కు ఆ సంస్థే వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని మెట్రో రైలు వర్గాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఏర్పాటవుతున్న ఎస్‌బీఐ క్యాప్స్‌ సంయుక్త కమిటీ మొదటి దశలోని మెట్రో ఆస్తులు, అప్పులు, భవిష్యత్‌ నిర్వహణ, ఆర్థిక బాధ్యతలు, అందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర వంటి అంశాలపై నివేదిక రూపొందించనుంది. ఆ నివేదిక ఆధారంగానే టేకోవర్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిటీ నివేదిక సెప్టెంబరు నాటికి సమర్పించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 05:21 AM