Share News

మెట్రో రైల్‌ విస్తరణకు చేయూతనివ్వండి

ABN , Publish Date - May 07 , 2026 | 05:29 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 నిర్మాణానికి చేయూతనివ్వాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మెట్రో రైల్‌ విస్తరణకు చేయూతనివ్వండి

  • ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉండండి

  • ‘ఎయిర్‌పోర్ట్‌ - ఫ్యూచర్‌ సిటీ’ ఫేజ్‌ -3 కింద చేపట్టండి

  • కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి

  • కేరళంలో మోదీ, షాలను ఓడించాం: సీఎం రేవంత్‌

  • నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

  • తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేతపై సీఎం ఫైర్‌

  • బాధ్యులైన అధికారులపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు

న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 నిర్మాణానికి చేయూతనివ్వాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫేజ్‌-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని గుర్తుచేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2, ఫేజ్‌-3 (ఆర్జీఐ ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌సిటీ)పై ఖట్టర్‌తో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫేజ్‌-2, ఫేజ్‌-3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్‌-1ను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌-2లో 7కారిడార్లతో మొత్తం 122.9కి.మీ మేర నెట్‌వర్క్‌ కోసం రూ.38,595 కోట్ల అంచనా వ్య యంతో రూపొందించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్‌ -3గా చేపట్టాలని కోరారు. మెట్రో ఫేజ్‌-3కి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్‌.వి.ఎ్‌స.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ప్రత్యేకాధికారి సంజయ్‌ కుమార్‌, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ పాల్గొన్నారు.

కేరళంలో మోదీ, అమిషాలను ఓడించాం: రేవంత్‌రెడ్డి

కేరళంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను ఓడించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో మోదీ షాలను కేరళంలో ఓడించినట్లు వ్యాఖ్యానించారు.

Updated Date - May 07 , 2026 | 05:29 AM