Share News

మెట్రో రుణంపై మళ్లీ ఇన్వాయిస్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:48 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదల్చిన రుణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ నేపథ్యంలో ...

మెట్రో రుణంపై మళ్లీ ఇన్వాయిస్‌

  • 13,600 కోట్లను బదలాయించాలని ఐఆర్‌ఎఫ్‌సీని కోరిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌

  • రాష్ట్ర ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌

హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదల్చిన రుణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ నేపథ్యంలో ఆ రుణం సొమ్మును బదలాయించాలంటూ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)... ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ)కు మళ్లీ ఇన్వాయిస్‌ నోటీసు పంపింది. జపాన్‌ సంస్థ నుంచి ఐఆర్‌ఎఫ్‌సీకి బదిలీ అయిన రూ.13,600 కోట్లను రాష్ట్రానికి ఇవ్వాలని కోరింది. దీనిపై ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ నెల 12న హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తొలిసారి ఐఆర్‌ఎఫ్‌సీకి ఇన్వాయిస్‌ నోటీసు పంపించింది. ఇన్వాయిస్‌ నోటీసు అంటే మంజూరైన రుణాన్ని మా ఖాతాలోకి బదిలీ చేయాలని కోరడం. ఈ ఇన్వాయిస్‌ గడువు మూడు రోజులే ఉంటుంది. అందుకే సీఎం రేవంత్‌ 15వ తేదీ సాయంత్రానికి రుణం విడుదల గడువు ముగుస్తుందని చెప్పారు. ఆ గడువు ముగిసిపోవడంతో తాజాగా మంగళవారం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మరోసారి ఐఆర్‌ఎఫ్‌సీకి ఇన్వాయిస్‌ పంపింది. ఈ లేఖతో పాటు మెయిల్‌ కూడా పంపించిందని సమాచారం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులను చేపట్టాలని యోచించింది. దీనిని చేపట్టాలంటే ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఏటా రూ.300-400 కోట్ల నష్టాలు వస్తున్నాయని, ఈ దృష్ట్యా రెండో దశ విస్తరణ పనులు చేపట్టలేమంటూ ఎల్‌ అండ్‌ టీ చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకుని, రెండో దశ విస్తరణ పనులను స్వయంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


అయితే ఎల్‌ అండ్‌ టీ సంస్థ బ్యాంకుల నుంచి 8.25 శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలంటే ఈ రుణాన్ని ప్రభుత్వమే తీర్చాల్సి ఉంది. అందుకే జపాన్‌ సంస్థను ఒప్పించి, రూ.13,600 కోట్ల రుణాన్ని కేవలం 4శాతం వడ్డీతో తీసుకోవడానికి కసరత్తు పూర్తి చేసింది. ఈ రుణం సొమ్ము కూడా జపాన్‌ సంస్థ నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఖాతాలో జమ అయినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉందని, దీనికి సోమవారమే ఆఖరు తేదీ అని ఆయన మీడియాకు వివరించారు. కానీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడడం వల్ల రుణం సొమ్ము రాష్ట్రానికి బదిలీ కాలేదని ఆరోపించారు. అయితే ప్రాజెక్టులను అపే సంస్కృతి బీజేపీలో లేదని, మార్పులు అవసరమైతే ధైర్యంగా చెబుతామని, ప్రాజెక్టులను అడ్డుకోమని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఐఆర్‌ఎఫ్‌సీ వద్ద ఉన్న రూ.13,600 కోట్లు రాష్ట్రానికి బదిలీ అవుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నిధులు వస్తే తప్ప రెండో దశ విస్తరణ పనులకు ఆటంకాలు తొలగవు. అందుకే నిధులను బదలాయించాలంటూ ఐఆర్‌ఎఫ్‌సీని హెచ్‌ఎండీఏ కోరింది. నిధులు రాకపోతే మొదటి దశ ప్రాజెక్టుతో పాటు రెండో దశ ప్రాజెక్టు కూడా సమస్యాత్మకంగా మారుతుందని, ఈ విషయంలో రాష్ట్ర ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది.

Updated Date - Jun 17 , 2026 | 04:48 AM