రెండ్రోజుల్లో రూ.2.4 కోట్ల లాభాలు.. రూ.99.50 లక్షలకు బురిడీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:40 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న కాంబోడియా ముఠాకు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు....
హైదరాబాద్ వ్యక్తికి సైబర్ నేరగాళ్ల టోకరా
ఏపీకి చెందిన ఏడుగురి అరెస్టు.. రూ.36లక్షలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న కాంబోడియా ముఠాకు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండ్రోజుల్లో రూ.2.4 కోట్లు లాభాలు చూపెట్టి రూ.99.50 లక్షలు కొట్టేసిన కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన రాపర్తి గౌతమ్, గాజువాకకు చెందిన సేనాపతి పెంటయ్య, మురపాలకు కుమార్, మంత్రి సాయికుమార్, విశాఖకు చెందిన బోడాల సాయికుమార్, విజ్జిపు సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రాంతానికి చెందిన ఉట్ల సత్యనారాయణను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.36లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిమనోహర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలోనే అధిక లాభాలంటూ వాట్సా్‌పలో వచ్చిన ఓ లింక్‌ను ఓపెన్ చేశాడు. దాంతో ఓ వాట్సాప్ గ్రూపులో సభ్యుడయ్యాడు. ఆగ్రూపులో చాలామంది పెట్టుబడిదారులున్నట్టు చూపిన సైబర్ ముఠా.. లాభాలకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను గ్రూపులో పోస్టు చేసేది. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేసి పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు మొదటి రోజు రూ.21.60 లక్షలు, రెండో రోజు 21.90లక్షలను గుర్తు తెలియని వ్యక్తి సూ చించిన ఖాతాల్లో జమ చేశాడు. రెండ్రోజుల్లో 2.4 కోట్లు లాభాలు పొందినట్టు ఆన్‌లైన్‌లో చూపెట్టారు. విత్‌డ్రాకు ప్రయత్నిస్తే 46లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని చెప్పగా.. బాధితుడు ఆ డబ్బును చెల్లించాడు. ఆ తర్వాత కూడా విత్‌డ్రా ఆప్షన్ ఇవ్వలేదు. వివిధ రకాల పన్నుల పేర్లు చెప్పి మరో 10 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఆ మొత్తాన్ని కూడా జమ చేశాడు. ఇలా మొత్తం 99.50లక్షలు పోగొట్టుకున్న బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఏపీకి చెందిన ఏడుగురు నిందితులను గుర్తించి వారిని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. కాంబోడియా ముఠాల నుంచి కమీషన్లు తీసుకుంటున్న నిందితులు వారికి మ్యూల్ ఖాతాలు ఇస్తున్నట్టు గుర్తించారు. బాధితుడి నుంచి ఐదు ఖాతాల్లోకి నగదు జమ చేయించిన నిందితులు ఆ మొత్తాన్ని 45బ్యాంకు ఖాతాలకు మళ్లించారు.