కోటిన్నర కట్నం కోసం మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:07 AM
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ వేదికగా పరిచయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అంటూ నమ్మించిన ఓ యువకుడు.. పెళ్లి పేరుతో ఓ యువతి కుటుంబాన్ని నిలువునా ...
ఎఫ్‌సీఐ ఆఫీసర్‌గా మ్యాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్
ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో యువతికి వేధింపులు
పోలీసులకు ఫిర్యాదుతో మోసగాడి అరెస్టు
దిల్‌సుఖ్‌నగర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ వేదికగా పరిచయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అంటూ నమ్మించిన ఓ యువకుడు.. పెళ్లి పేరుతో ఓ యువతి కుటుంబాన్ని నిలువునా ముంచేందుకు యత్నించాడు. భారీగా కట్నం డిమాండ్ చేయడంతో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని గదికి పిలిచి వేధించాడు. అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు ఆరా తీయగా అతడి మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన పనస మధు (30) ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్‌ను చూసి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని, వారి కుటుంబాన్ని కలిశాడు. తాను ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. నకిలీ ఐడీ కార్డు కూడా చూపించాడు. నిజమని నమ్మిన యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. వారు ధనవంతులు అని గుర్తించిన మధు.. రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు. చివరకు కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్‌కు రప్పించిన మధు, చైతన్యపురిలోని ఓ గదికి తీసుకెళ్లి ఆమెను అనుమానిస్తూ వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి కటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో వారు మధు గురించి ఆరా తీయగా.. ఎఫ్‌సీఐలో ఉద్యోగం అబద్ధం అని తేలింది. అతడి మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.