కూతురి కాపురం కూల్చాడని యువకుడి హత్య
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:41 AM
వారు ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు మరొకరితో ఆమెకు వివాహం చేశారు. కానీ ఏడాదికే వారి కాపురం కూలిపోయింది.
బావమరిది, మరికొందరితో కలిసి యువతి తండ్రి దారుణం
మాదాపూర్‌లో ఘటన..
హైటెక్‌సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వారు ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు మరొకరితో ఆమెకు వివాహం చేశారు. కానీ ఏడాదికే వారి కాపురం కూలిపోయింది. ఇదంతా జరిగేందుకు ప్రేమించిన యువకుడే కారణమని భావించిన యువతి తండ్రి.. మరికొందరితో కలిసి ప్లాన్ ప్రకారం అతడిపై కర్రలతో దాడి చేసి దారుణంగా చంపేశాడు.. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన సినేపల్లి రాములు కుమారుడు భాస్కర్ (32).. అదే గ్రామానికి చెందిన రాజు కుమార్తె నికితకు ఆరేళ్ల క్రితం పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. తండ్రి రాజుకు విషయం తెలియడంతో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామం లో పంచాయితీ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2023లో నికితకు మరొకరితో వివాహం చేశాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే నికిత ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. విడాకులు తీసుకొని విడిపోయారు. ఇటు హైదరాబాద్‌కు వచ్చిన భాస్కర్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా చేరాడు. ఈ క్రమంలోనే ఇక్కడే ఉంటున్న నికిత చెల్లెలితోనూ చాటింగ్‌లు మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం తండ్రి రాజుకు తెలిసింది.
పెద్ద కూతు రు కాపురాన్ని కూల్చిందే చాలక.. మరో కూతురితోనూ భాస్కర్ మాట్లాడుతుండటాన్ని సహించకలేకపోయాడు. భాస్కర్‌ను ఎలాగైనా అంతమొదించాలని భావించాడు. ఇదే విషయాన్ని బావమరిది కుమార్‌స్వామికి చెప్పాడు. ఇద్దరూ కలిసి పథకం వేసి.. మరో ఐదుగురుకి డబ్బులిచ్చి తమతో చేర్చుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భాస్కర్ పనిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లిన వీరు.. మాట్లాడాలంటూ అతడిని కిందకు రప్పించారు. భాస్కర్ కిందకు రాగానే అందరూ కలిసి కర్రలతో దాడిచేసి పారిపోయా రు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులు రాజు, కుమార్‌స్వామితో పాటు మిగతా వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజు, కుమార్‌స్వామి పోలీసు ల ఎదుట లొంగిపోగా.. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు.
దళితులం కాబట్టే చంపేశారు: మృతుడి సోదరుడు
భర్తతో విడాకులు తీసుకున్న నికిత.. బుధవా రం గుడిలో తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిందని మృతుడి సోదరుడు మధు మీడియాకు చెప్పాడు. ఈ విషయం తెలిసి నికితను తండ్రి రాజు దాచిపెట్టి.. భాస్కర్ హత్య కు పథకం వేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో వారి ప్రేమ విషయం తెలిసినప్పుడే తన తమ్ముడిని ఎలాగైనా చంపుతానని రాజు బెదిరించాడన్నాడు. తాము దళితులం కాబట్టే ఇంత దారుణంగా హత్య చేశారని రోదించాడు.