ఎల్‌ఎల్‌ఆర్.. నో స్లాట్!
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:28 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్‌ఎల్‌ఆర్) స్లాట్‌లు బుక్ చేసుకోవడం గగనంగా మారింది.
లెర్నర్ లైసెన్స్ పరీక్ష కోసం 3 నుంచి 4 వారాల నిరీక్షణ
పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఇదే పరిస్థితి
స్లాట్‌లు తగ్గించడమే కారణం
సిబ్బంది కొరత వల్లే స్లాట్‌లు తగ్గించామంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్‌ఎల్‌ఆర్) స్లాట్‌లు బుక్ చేసుకోవడం గగనంగా మారింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూరించి.. నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష కోసం మూడు నుంచి నాలుగు వారాలు వేచి చూడాల్సిన పరిస్థితి. దీనికి స్లాట్‌లు పరిమితంగా ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్ కోసం వారాలు, ఒక్కోసారి నెలల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ఎల్‌ఎల్‌ఆర్ కోసం వేచి చూడక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ పరివాహన్ పోర్టల్‌తో అనుసంధానం అనంతరం ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరివాహన్‌లోని సారధి ద్వారా ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా అవసరమైన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. రుసుము చెల్లించాలి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిఉంటుంది. కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్లాట్‌లు వారాల తరబడి ఖాళీ ఉండడం లేదు. వారం రోజులుగా స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మార్చి 10 తర్వాతే అందుబాటులో ఉన్నట్టు చూపుతోందని పలువురు చెబుతున్నారు. కొన్నిచోట్ల ట్రాక్ పరీక్షల స్లాట్ బుకింగ్‌కూ నిరీక్షించాల్సి వస్తోంది.
50 శాతానికిపైగా తగ్గిన స్లాట్‌లు
గ్రేటర్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా స్లాట్‌లు తగ్గించారు. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కో కార్యాలయంలో నిత్యం 100 నుంచి 200 స్లాట్‌లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడది సగానికిపైగా తగ్గినట్టు సమాచారం. ఖైరతాబాద్ కార్యాలయంలో ఇంతకుముందు రోజూ 80 నుంచి 100.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ స్లాట్‌లు బుక్ చేసుకునే వారు. ఇప్పుడా సంఖ్య 60 వరకు తగ్గించినట్టు సమాచారం. ఉప్పల్‌లో గతంలో ఒక్కోసారి రోజుకు 250 మందికి కూడా కంప్యూటర్‌పై లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడక్కడ నిత్యం 70-80 స్లాట్‌లే బుక్ అవుతున్నాయి. మేడ్చల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నం (మన్నెగూడ), బండ్లగూడ, తిరుమలగిరి, మణికొండ, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. కోర్ ఏరియాతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోని ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఎల్‌ఎల్‌ఆర్ స్లాట్‌ల బుకింగ్ ఎక్కువగా ఉంటోంది. పరిమిత స్లాట్‌లు ఉండడంతో ఆ ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారు.
అందుబాటులో ఉన్న కంప్యూటర్లు, సిబ్బంది, క్లర్కులు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారుల ఆధారంగా ఎల్‌ఎల్‌ఆర్ స్లాట్‌ల సంఖ్య ఉంటుంది. గతంతో పోలిస్తే సిబ్బంది సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేకున్నా.. స్లాట్‌లు గణనీయంగా తగ్గడం గమనార్హం. ఒక్కో ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు 10 నిమిషాల సమయం పడుతుంది. ఆ తరువాతే మరొకరికి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్లాట్‌ల సంఖ్యను తగ్గించినట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఉద్యోగుల కొరత వల్లే పరిమిత స్థాయిలో స్లాట్‌ల బుకింగ్‌కు అవకాశం కల్పించామని చెబుతున్నారు. ‘సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిఒత్తిడి పెరుగుతోంది. స్లాట్‌లు తగ్గించాల’ని కొందరు ఆర్టీవోలు విజ్ఞప్తి చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ‘సారధి’లో ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తు నమోదుకు 3 నుంచి 4 గంటలు పడుతోంది. గతంలో సులభంగా ఉన్న నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.