లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న గ్రిల్
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:12 AM
లిఫ్ట్ గుంతలో పడి ఓ మహిళ మరణించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ మహిళతో కలిసి లిఫ్ట్ గుంతులో పడిన 15 నెలల వయస్సున్న ఆమె మనవడు తీవ్ర గాయాలతో...
మనవడితో కలిసి లిఫ్ట్ గుంతలో పడ్డ మహిళ మృతి
15 నెలల చిన్నారి పరిస్థితి విషమం
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన
ఖైరతాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): లిఫ్ట్ గుంతలో పడి ఓ మహిళ మరణించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ మహిళతో కలిసి లిఫ్ట్ గుంతులో పడిన 15 నెలల వయస్సున్న ఆమె మనవడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రాధ(57)కు భర్త లేరు. హైదరాబాద్‌లోని తన కూతురు, అల్లుడి వద్ద ఉంటోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఉప్పల్‌లో నివాసమున్న రాధ కుమార్తె కుటుంబం పది రోజుల క్రితమే ఖైరతాబాద్, ఆనంద్‌నగర్ కాలనీలోని భావన అపార్ట్‌మెంట్‌కు మారారు. ఆ కుటుంబం అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో ఫ్లాట్‌లో నివసిస్తుండడగా.. 15 నెలల వయస్సు ఉన్న మనవడి ఆలనాపాలనను రాధ చూసుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తర్వాత మనవడిని ఆడిపించేందుకు రాధ భవనం ఐదో అంతస్తుకు వెళ్లింది. కాసేపటి తర్వాత తిరిగి కిందికి వెళ్లేందుకు మనవడిని ఎత్తుకొని లిఫ్ట్ వద్దకు వచ్చింది. మధుమేహం వల్ల రాధ కంటి చూపు సక్రమంగా లేదని తెలిసింది. అయితే, లిఫ్ట్ ఐదో అంతస్తులోనే ఉందని భావించిన రాధ.. డోర్‌ను తెరిచేందుకు పలుమార్లు యత్నించింది. ఆపై, లిఫ్ట్ రాకున్నా గ్రిల్ తెరుచుకునే సరికి మనవడితో కలిసి ముందడుగు వేసింది. దీంతో రాధ మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్‌పై పడి అక్కడికక్కడే మరణించింది. రాధ తన మనవడిని గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాధ, ఆమె మనవడిని బయటకు తీశారు. రాధను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. రాధ మనవడు కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.