హైదరాబాద్‌లో ‘స్త్రీ రైడర్లు’
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:42 AM
స్విగ్గీ, జోమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్ చేసిన ఆహారాన్ని మనకు తెచ్చే ఇచ్చేది.. ఓలా, ర్యాపిడో, ఉబెర్‌లో రైడ్ బుక్ చేస్తే మనల్ని గమ్యస్థానాలకు చేర్చేది పురుషులే..
గిగ్, డెలివరీ రంగాల్లోకి మహిళలు.. ‘స్త్రీ రైడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
తొలి విడతలో 55 మందికి డ్రైవింగ్ శిక్షణ, ఉపాధి కల్పన
ఈ-బైక్, ఈ-ఆటోల పంపిణీ
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): స్విగ్గీ, జోమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్ చేసిన ఆహారాన్ని మనకు తెచ్చే ఇచ్చేది.. ఓలా, ర్యాపిడో, ఉబెర్‌లో రైడ్ బుక్ చేస్తే మనల్ని గమ్యస్థానాలకు చేర్చేది పురుషులే.. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ గిగ్, డెలివరీ రంగాల్లో హైదరాబాద్‌లో ఇకపై మహిళలు కూడా కనిపించనున్నారు. అవును.. రవాణ, డెలివరీ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం, రవాణా శాఖ సంయుక్తంగా ‘‘స్త్రీ రైడ్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టాయి. మహిళలకు వాహనాలు నడపడం నేర్పించి వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ స్త్రీ రైడ్ ప్రాజెక్టును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ప్రారంభించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 55 మంది మహిళలకు ఈ- బైక్, ఈ- ఆటోలను అందజేశారు. మహిళల ఉపాధి, సాధికారతకు ప్రభుత్వం పూర్తిస్ధాయి మద్దతిస్తుందని డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. మహిళా రైడర్లు ఇకపై స్విగ్గి, జోమాటో లాంటి ఫుడ్ డెలివరి ప్లాట్‌ఫామ్స్‌లో పని చేస్తారని తెలిపారు. నాలుగు నెలల్లో వీరి సంఖ్యను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గిగ్ వర్కర్లు అంటే ఇన్నాళ్లూ పురుషులే ఉండేవారని ఇప్పుడు ఈ రంగంలోకి మహిళలు కూడా ప్రవేశించారని ఆనంద్ పేర్కొన్నారు. రవాణా, డెలివరీ రంగాల్లో మహిళలకు ఉపాధి కల్పించే క్రమంలో మహిళల నుంచి డ్రైవర్లుగా ఉండటానికి గతంలో దరఖాస్తులు ఆహ్వనించామన్నారు. అందులో ఎంపిక చేసిన 55 మందికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇప్పించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ అంతటా లాజిస్టిక్, కార్గో, డెలివరీ సర్వీ్‌సలలో మహిళా డ్రెవర్లుకు అవకాశం ఇస్తామని చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్‌లో ఒక్క మహిళా ఎస్‌హెచ్‌ఓ కూడా ఉండేవారు కాదని, తాను హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా ఇన్ స్పెక్టర్లను పోలీసు స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా నియమించానని సీవీ ఆనంద్ వివరించారు. కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా. శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేష్ భగవత్, ఎస్‌పీఎఫ్ డీజీపీ స్వాతి లక్రా ఇతర అధికారులు పాల్గొన్నారు.