Share News

వెయ్యి కోట్ల భూమికి నకిలీ జీవోలతో స్కెచ్‌

ABN , Publish Date - May 30 , 2026 | 04:01 AM

హైదరాబాద్‌ గండిపేట చెరువు అలుగుదూకే ప్రాంతం. కొండల మధ్య పచ్చగా రహస్య దుర్గంలాగా ఉంటుంది. అక్కడ చెరువు కట్ట పొడవునా కోటీశ్వరుల ఫామ్‌ హౌస్‌లు. అలుగు దూకేచోట మూసీ పక్కనే హెటెరో డ్రగ్స్‌ ఫామ్‌.....

వెయ్యి కోట్ల భూమికి నకిలీ జీవోలతో స్కెచ్‌

  • రూ.35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు డీల్‌

  • ఒప్పందంలో భాగంగా 4 కోట్లు బదిలీ

  • గండిపేట భూమి రెగ్యులరైజ్‌ అయినట్లు 5 నకిలీ జీవోలు

  • సోషల్‌ మీడియాలోనూ ప్రచారం

  • తహసీల్దారు ఫిర్యాదుతో కదిలిన డొంక

  • జీవోల్లో ఉన్నవారి ఇళ్లలో సోదాలు

  • మాజీ ఎమ్మెల్యేతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడి

  • ఆయన ఖాతా నుంచే 1.25 కోట్ల బదిలీ

  • బ్రహ్మనాయుడు మరో ముగ్గురు పరారీలో

హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గండిపేట చెరువు అలుగుదూకే ప్రాంతం. కొండల మధ్య పచ్చగా రహస్య దుర్గంలాగా ఉంటుంది. అక్కడ చెరువు కట్ట పొడవునా కోటీశ్వరుల ఫామ్‌ హౌస్‌లు. అలుగు దూకేచోట మూసీ పక్కనే హెటెరో డ్రగ్స్‌ ఫామ్‌ హౌస్‌, ఇస్టారా విల్లాస్‌ ఉన్నాయి. ఒక్కో విల్లా ఖరీదు 12-20 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడే వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఒక పదెకరాల ప్రభుత్వ భూమికి ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. గండిపేట గ్రామానికే చెందిన కొంతమంది ఆ భూమిపై హక్కును సృష్టించుకొనే ప్రయత్నం హైకోర్టులో విఫలమైన తర్వాత వారికి ఆ భూమి రెగ్యులరైజ్‌ అయినట్లుగా నకిలీ జీవోలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మార్వో అప్రమత్తమై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అరెస్టు కాగా, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సహా నలుగురు పరారీలో ఉన్నారు. సంచలన భూకుంభకోణంపై శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. గండిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే 18లో మొత్తం 104.25 ఎకరాలు ఉండగా, అందులో సుమారు 9.28 ఎకరాలకు గండిపేటకు చెందిన ఐదుగురు తమకు క్రమబద్ధీకరించారంటూ నకిలీ జీవోలు సృష్టించి, వాటిని సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని సొమ్ము చేసుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై గండిపేట తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు, సైబర్‌ క్రైం, సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యు) పోలీసులు దర్యాప్తు జరిపారు.


ప్రభుత్వ భూమిని కాజేసే కుట్రను బట్టబయలు చేశారు. ఈ భూమి 1954 నుంచి కాస్రా పహానీలో ప్రభుత్వ భూమిగానే ఉంది. గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల దశరథ కుటుంబ సభ్యులు ఆ స్థలంలోకి వచ్చి ఇది తమదేనని, ఇందులో పది ఎకరాలు తమకే వస్తుందని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేశారు. 2012లో నిమ్మల దశరథ్‌ కుటుంబ సభ్యులు హైకోర్టులో ఒక రిట్‌ పిటిషన్‌ వేశారు. రిట్‌ పెండింగ్‌లో ఉండగానే రుద్రరాజు రామకృష్ణ రాజు అనే వ్యక్తికి అగ్రిమెంట్‌ చేశారు. రుద్రరాజు సునీల్‌ అనే వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకువచ్చి, ఆ భూమిలో ఒక గదిని నిర్మించి అందులో ఉంచాడు. రుద్రరాజు రామకృష్ణ రాజు ఆ భూమిని సొంతం చేసుకోలేనని అర్థమై వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అప్పటికే ఆ భూమిలోని ఓ గదిలో ఉంటున్న సునీల్‌నే నిమ్మల కుటుంబ సభ్యులు కొనసాగించారు. హైకోర్టు నిమ్మల కుటుంబం రిట్‌ పిటిషన్‌ను 6-10-2025లో కొట్టేసింది. ప్రభుత్వ భూమిగానే పరిగణించింది.

23న తహసీల్దార్‌ ఫిర్యాదు

ప్రభుత్వ పోరంబోకు భూమిని పైవ్రేట్‌ వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించినట్లు నకిలీ జీవోలు సృష్టించి వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తుండటంతో గండిపేట మండల తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి ఈ నెల 23న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం నంబర్‌ 990/2026 కింద కేసు నమోదు చేశారు. కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్‌ పొందిన పోలీసులు గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్‌, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిమ్మల దశరథ్‌ చనిపోవడంతో ఆయన కుమారులు రాజేష్‌ గౌడ్‌ పేరు మీద 2.02 ఎకరాలు, నిమ్మల వేణుగోపాల్‌ పేరు మీద 2.02 గుంటలు, నిమ్మల రామస్వామి పేరు మీద 2.02 గుంటలు, కుమార్తె గారెల మంగ పేరు మీద 2.02 గంటలు, కామను నాగేశ్వర్‌రావు పేరు మీద 1.20 గుంటలు కలిపి మొత్తం 9 ఎకరాల .28 గుంటలను ప్రభుత్వం తమకు క్రమబద్దీకరించిందంటూ 5 వేర్వేరు జీవోలను తయారు చేశారు. నకిలీ జీవోల తయారీలో నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్‌, సునీల్‌, రాధాకృష్ణ పాత్ర ఉందని తమ దర్యాప్తులో వెల్లడైందని డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. బొల్ల రమేష్‌, బ్రహ్మనాయుడు భూమి కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లుగా వ్యవహరించగా, సునీల్‌, రాధాకృష్ణలు అక్రమ భూలావాదేవీలకు మధ్యవర్తిత్వం చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ పేర్కొన్నారు.


రూ.35 కోట్లకు ఎంఓయూ

సర్వే నంబరు 18లోని భూములకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకపోయినా, బొల్ల రమేష్‌, బ్రహ్మనాయుడులతో కలిసి ఈ భూమిని విక్రయించేందుకు నిమ్మల కుటుంబ సభ్యులు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిమ్మల కుటుంబ సభ్యులు బొల్ల రమేష్‌, బ్రహ్మనాయుడు మధ్య ఎకరా రూ.3.5 కోట్ల చొప్పున రూ.35 కోట్లకు ఎంఓయూలు కుదిరినట్లు తేల్చారు. డీల్‌లో భాగంగా నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చినట్లు తేలింది. బ్రహ్మనాయుడు ఖాతా నుంచే రూ.1.25 కోట్లు బదిలీ అయ్యాయి. బొల్ల రమేష్‌, బ్రహ్మనాయుడు, సునీల్‌, రాధాకృష్ణ పరారీలో ఉండగా, నిమ్మల రాజేష్‌ గౌడ్‌, నిమ్మల వేణుగోపాల్‌, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. భూముల కొనుగోలుకు ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల ద్వారా యాజమాన్య హక్కులు, పత్రాల నిజానిజాలను తప్పనిసరిగా ఽధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని గండిపేట తహ సీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. బఫర్‌ జోన్‌లో ఉన్నప్పటికీ చుట్టుపక్కల భూముల ప్రకారం చూస్తే మార్కెట్‌ విలువ కనీసం ఎకరానికి రూ.50 కోట్లవరకు ఉంటుందన్నారు. 9.28 ఎకరాల విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ఈ భూమి విలువ కనీసం 1500 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.


కొండకు వెంట్రుక వేసినట్లు!

ఎలాంటి హక్కులు లేనిచోట హక్కులు పుట్టించి, న్యాయపోరాటం చేసి, విఫలమై ఆశలు వదులుకొని ఒకరు వెళ్లిపోయాక కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇంత సాహసానికి ఎందుకు ప్రయత్నించారని తెలంగాణ రెవెన్యూ, పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్రిమినల్‌ ఉద్దేశం లేకుంటే మాజీ ఎమ్మెల్యే ఆ భూమికి ఎందుకు ఎంవోయూ చేసుకున్నారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎంత అమాయకుడైనా రూ.వెయ్యి కోట్లకు పైనే విలువున్న లీగల్‌ భూమిని రూ.35 కోట్లకు అమ్ముతాడా? అని అడుగుతున్నారు. తమ ప్రాథమిక విచారణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాత్రపై స్పష్టత వచ్చినట్లుగా పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పైకి చూస్తే రూ.4 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారు, మోసపోయారన్న భావన కలుగుతుంది. కానీ, కొండకు వెంట్రుక వేశారు, వస్తే కొండ... పోతే వెంట్రుక అనే పద్ధతిలో ఈ డీల్‌ జరిగిందని, మొత్తం స్కెచ్‌లో బ్రహ్మనాయుడు పాత్ర ఉందని పోలీసులు అంటున్నారు. ఆధారాలు కూడా దొరికాయి అని చెబుతున్నారు. మరో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకుంటే మొత్తం భూకుంభకోణం వ్యవహారం బయటకు వస్తుందని అంటున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ విభాగంలో ఎవరి హస్తం ఉంది? అనేది చర్చగా మారింది. వెనుక రెవెన్యూ తలకాయలు లేకుండా అడుగు ముందుకు పడదని పోలీసులే అంటున్నారు. ముందు నకిలీ జీవోలు తయారు చేయడం, తర్వాత పథకం ప్రకారం సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం... అబద్ధాన్ని నిజంగా భ్రమింపజేసే మైండ్‌ గేమ్‌ అంటున్నారు.

Updated Date - May 30 , 2026 | 04:01 AM