కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అంతా బ్రహ్మనాయుడే..!
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:29 AM
హైదరాబాద్, గండిపేటలో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చుట్టూ ....
భూమిని రూ.30కోట్లకు కొనుగోలు చేసి రూ.600కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ ?
ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు!
హైదరాబాద్ సిటీ, జూన్ 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, గండిపేటలో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న రైతులను ఒప్పించి మొత్తం 9.28 ఎకరాలను సుమారు రూ.30 కోట్లకు కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు పన్నాగం పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే, నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చి, దానిని సుమారు 20 రెట్లు ధరకు విక్రయించి తద్వారా సుమారు రూ.600 కోట్లు కొల్లగొట్టడానికి బ్రహ్మనాయుడు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. ఈ పూర్తి క్రైమ్ కథా చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అంతా బొల్లా బ్రహ్మనాయుడేనని, తెర వెనుక ఉండి ఆయనే అంతా నడిపించినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. సదరు భూమిని సాగు చేసుకుంటున్న రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్, మంగమ్మ, నకిలీ జీవోలు సృష్టించడంలో ఆరితేరిన రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్, బొల్ల రమేష్, రాజేష్, ప్రభుదా్‌సలను బ్రహ్మనాయుడు పాత్రదారులుగా వాడుకున్నారని అంటున్నారు. ఇక, ఇప్పటిదాకా ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వాంగ్మూలాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కేసు నార్సింగి పోలీ్‌సస్టేషన్ నుంచి ఈవోడబ్ల్యూకు బదిలీ కావడంతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బ్రహ్మనాయుడు, అతని బృందాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను నార్సింగి పోలీసుల నుంచి తీసుకొని పరిశీలించారు. నిందితుల స్టేట్‌మెంట్‌లను పరిగణనలోకి తీసుకున్న ఈవోడబ్ల్యూ పోలీసులు ఈ మొత్తం భూదందాలో ప్రధాన కీలకసూత్రదారి బొల్లా బ్రహ్మనాయుడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. న్యాయస్థానం అనుమతితో బ్రహ్మనాయుడు, అతడి బృందాన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ భూ కుంభకోణంలో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.