Share News

ఎకరా రూ.237 కోట్లు!

ABN , Publish Date - May 29 , 2026 | 03:28 AM

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సరికొత్త రికార్డు నెలకొంది. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో పలికిన ధరలన్నింటినీ....

ఎకరా రూ.237 కోట్లు!

  • తెలంగాణ రియల్‌ ఎస్టేట్లో సరికొత్త రికార్డు

  • సర్కారు వారి పాట రూ.139 కోట్లు

  • 70.5 శాతం అధిక ధరకు అమ్మకం

  • రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌లో 6.29 ఎకరాలు కైవసం చేసుకున్న ‘గౌర వెంచర్స్‌’

  • గత ఏడాది వేలంలో ఎకరా రూ.177 కోట్లు

  • రావిర్యాలలో గజం ధర రూ.86,500

హైదరాబాద్‌/సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సరికొత్త రికార్డు నెలకొంది. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో పలికిన ధరలన్నింటినీ అధిగమిస్తూ రికార్డు ధర నమోదైంది. రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌లో ఎకరాకు సుమారు రూ.237 కోట్ల రికార్డు ధర లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా రూ.139 కోట్లతో పోలిస్తే దాదాపు 70.5 శాతం అధికానికి ఆన్‌లైన్‌ వేలంలో అమ్ముడుపోయింది. రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌ మధ్యలో టీ హబ్‌ వెనుక భాగంలో ఉన్న ఈ ప్లాట్‌ విస్తీర్ణం 6.29 ఎకరాలు. సర్వే నంబర్‌ 83/1. ప్లాట్‌ నంబర్‌ 1ఏ & 1/ఎఫ్‌. బహుళ వినియోగానికి అనుమతి ఉన్న భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. ఓఆర్‌ఆర్‌ నుంచి శిల్పా ఫ్లైఓవర్‌ మీదుగా తీగల వంతెనకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్లాట్‌ ఉండటంతో దేశంలోని ప్రముఖ రియల్‌ ఎస్ట్‌‌ట్‌ డెవలపర్లు భారీగా పాల్గొని పోటాపోటీగా బిడ్లు వేశారు. చివరకు రూ.1,490.73 కోట్లకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్ట్టేట్‌ సంస్థ గౌర వెంచర్స్‌ దక్కించుకుంది. ఇందులో ఆ సంస్థ బహుళ అంతస్తుల వాణిజ్య, ఐటీ భవనాలను నిర్మించనున్నట్లు ఆ సంస్థ అధినేత ఆదిత్య గౌర తెలిపారు. గతేడాది టీజీఐఐసీ ఇదే గ్రోత్‌ కారిడార్‌లో 7.67 ఎకరాలను వేలం వేయగా అత్యధికంగా ఎకరం రూ.177 కోట్ల పలికింది. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అదే పెద్ద రికార్డు. ప్రముఖ ఫార్మాసంస్థ ఎంఎస్ఎన్‌ అప్పట్లో సదరు భూమిని దక్కించుకుంది. తాజాగా 8 నెలల వ్యవధిలోనే టీజీఐఐసీ తాజా వేలంలో 34 శాతం అదనపు ధరకు అదే గ్రోత్‌ కారిడార్‌లో అర కిలోమీటర్‌ ఎడంగా ఉన్న మరో ప్లాట్‌ అమ్ముడుపోయింది. ప్లాట్‌కు ఉత్తరాన 150 అడుగుల రోడ్డు, పడమర వంద అడుగుల రోడ్డు ఉన్నాయి.


పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది: టీజీఐఐసీ ఎండీ

ఆన్‌లైన్‌ వేలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ పోర్టల్‌ ద్వారా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ పోర్టల్‌ ద్వారానే చాలా రాష్ట్రాలు విలువైన ఆస్తులను వేలం వేస్తున్నాయి. పారదర్శకంగా జరిగిన ఈ వేలానికి అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ సాయం తీసుకున్నారు. అది ప్రభుత్వానికి లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ శశాంక మాట్లాడుతూ, రాయదుర్గం ఈ-వేలానికి వచ్చిన అపూర్వ స్పందన హైదరాబాద్‌, తెలంగాణపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎకరాకు రూ.237 కోట్ల ధర లభించడం రాష్ట్ర అభివృద్థి ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడమే ఈ విజయానికి కారణమన్నారు. హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక వసతులు, భారీ అభివృద్థి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానం అనే విషయాన్ని ఈ వేలం మరోసారి ధ్రువపరిచిందని చెప్పారు.

గౌరా వెంచర్స్‌ నేపథ్యం?

గౌర వెంచర్స్‌ వ్యవస్థాపకుడు ఆదిత్య గౌర మూడు దశాబ్దాలకు పైగా రియల్‌ ఎస్టేట్‌ అనుభవంతో ఇప్పటివరకు లక్షల చదరపు అడుగుల కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేశారు. గతంలో క్రెడాయి(కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా)లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. పెట్రో కెమికల్‌, ఎయిరో స్పేస్‌, డిఫెన్స్‌, ఐటీ రంగాల్లో కూడా ఈ గ్రూప్‌ తన కార్యకలాపాలు సాగిస్తోంది.

రావిర్యాలలో 140కోట్ల ఆదాయం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో హౌసింగ్‌ బోర్డు భూములకు రికార్డు ధర పలికింది. బోర్డు పరిధిలో గురువారం నాలుగు ప్లాట్లు వేలం వేయగా, గజం ధర గరిష్టంగా రూ.83,500 పలికిందని బోర్డు మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 1000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మొత్తం 17 సంస్థలు పోటీ పడ్డాయని తెలిపారు. 1,113 చదరపు గజాల విస్తీర్ణానికి గజం రూ.26 వేలు కనీస ధరగా నిర్ణయించగా, బిడ్డర్ల పోటీలో ఒక సంస్థ రూ.83,500కు దక్కించుకుందని వెల్లడించారు. ఆరు వేల గజాల స్థలం రూ.62,500 పలికిందన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్‌, చింతల్‌ ప్రాంతాల్లోని మరో నాలుగు ఓపెన్‌ ప్లాట్లకు ఈ వేలం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - May 29 , 2026 | 03:28 AM