ఎకరం.. రూ.264 కోట్లు!
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:41 AM
హైదరాబాద్‌లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని ప్లాట్ నంబర్ పీ1కు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో..
రాయదుర్గంలో అత్యధిక రేటు
రాష్ట్రంలో భూముల ధరల రికార్డు బ్రేక్
హైదరాబాద్‌పై విశ్వాసం పెరగడానికి ఇది నిదర్శనం: టీజీఐఐసీ
రియల్ జోరు ఆగే చాన్సే లేదు: క్రెడాయ్
రాయదుర్గం భూముల వేలంలో జోక్యానికి సుప్రీం నిరాకరణ
హైదరాబాద్/సిటీ/న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని ప్లాట్ నంబర్ పీ1కు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.264 కోట్లు పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 5.25 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. నిజానికి పీ1 ప్లాట్‌కు తొలుత ఎకరాకు రూ.175 కోట్ల చొప్పున రిజర్వ్ ధర నిర్ణయించారు. కానీ పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇదే ప్రాంతంలో టీజీఐఐసీ గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు పలకగా.. తాజా వేలం ఆ రికార్డును అధిగమించింది. హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఇది స్పష్టం చేస్తోందని టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కె.శశాంక చెప్పారు. పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు.
భూముల ధరలు పైపైకే!
హైదరాబాద్‌కు పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో కోకాపేటలో భూములను ప్రభుత్వం విక్రయించగా ఎకరానికి రూ.10 కోట్లు ధర పలికింది. తర్వాత అదే ఒరవడి కొనసాగింది. కోకాపేటలో 2021లో హెచ్‌ఎండీఏ వేలంలో ఎకరం ధర రూ.60.20కోట్లు పలికింది. 2023 ఆగస్టులో రూ.100 కోట్లు దాటింది. గతేడాది నవంబర్‌లో కోకాపేటలోనే ఎకరం రూ.151 కోట్లు పలికింది. రాయదుర్గంలో రూ.177కోట్లకు చేరింది. ఇప్పుడు ఏకం గా ఎకరా రూ.264కోట్లు పలికింది. కోకాపేట, రాయదుర్గమే కాదు.. ఐటీ కారిడార్‌లోని పుప్పాలగూడ, నార్సిం గి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, మణికొండ, నల్లగండ్ల, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూములన్నీ మల్టీయూజ్ (వాణిజ్య, నివాస) జోన్‌లో ఉండటం, భవనాల ఎత్తుపై ఆంక్షలేమీ లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది.
రాయదుర్గం భూముల వేలంలో జోక్యానికి సుప్రీం నిరాకరణ
రాయదుర్గం పాన్‌మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పాన్‌మక్తా భూముల వేలం ప్రక్రియను నిలివేయాలంటూ ప్రణయ్ సింహారావు ఈ నెల 13న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కానీ పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని.. ఆ భూములకు, ఇప్పుడు వేలం వేస్తున్న భూములకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వేలం అంశంలో కలగజేసుకునేందుకు నిరాకరించింది.
నగరంలో పెట్టుబడులకు కచ్చితంగా లాభం
హైదరాబాద్ నగరంలో ఆఫీసు స్పేస్‌కు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే కచ్చితంగా రిటర్న్‌లు వచ్చే పరిస్థితి ఉంది. దాంతో రాష్ట్రంలోని డెవలపర్లతోపాటు ఇతర రాష్ట్రాల సంస్థలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతం ఆఫీసు స్పేస్‌కు కానీ, కమర్షియల్ స్పేస్‌కు అనువైనది. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను చేపట్టాలని చాలా సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసమే పోటీపడి మరీ భూములను కొనుగోలు చేస్తున్నాయి.
- క్రెడాయ్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి