నాచుమొక్క నుంచి సహజ నీలిరంగు
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:06 AM
స్పిరులినా (నాచుమొక్క) నుంచి సహజసిద్ధమైన నీలి రంగు (సి-ఫైకోసయనిన్)ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేేసందుకు హైదరాబాద్‌కు చెందిన ‘కేఎన్ బయోసైన్సెస్’ సంస్థ సిద్ధమైంది.
ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ సంస్థకు టీడీబీ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : స్పిరులినా (నాచుమొక్క) నుంచి సహజసిద్ధమైన నీలి రంగు (సి-ఫైకోసయనిన్)ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేేసందుకు హైదరాబాద్‌కు చెందిన ‘కేఎన్ బయోసైన్సెస్’ సంస్థ సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాంకేతిక అభివృద్ధి మండలి (టీడీబీ) భారీ ఆర్థిక చేయూతను ప్రకటించింది. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో టీడీబీ కీలక ప్రకటన చేసింది. ఈ వినూత్న సాంకేతికతను భారతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఐఐటీ) గువహటీ పరిశోధకులు స్వదేశీ స్పిరులినా రకం (ఎన్‌సీఐఎం 5143) ఉపయోగించి అభివృద్ధి చేశారు. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందం ద్వారా దీన్ని కేఎన్ బయోసైన్సెస్ కు బదలాయించారు. ఆహారం, న్యూట్రాస్యూటికల్స్, వ్యవసాయం, ఆక్వాకల్చర్, పౌల్ర్టీ ఫీడ్ రంగాల్లో ఈ సహజ నీలి రంగుకు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రంగులపై ఆధారపడటాన్ని తగ్గించి, ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది. పాత పద్ధతుల్లో రంగులు తీయడానికి రసాయనాలు వాడేవారు. కానీ, కొత్త పద్ధతిలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా (గ్రీన్ ఎక్స్‌ట్రాక్షన్) రంగును వేరు చేస్తారు. ఈ నాచును ల్యాబ్‌లో కాంతి, పోషకాలను సమపాళ్లలో అందిస్తూ పెంచుతారు. దీని ద్వారా వచ్చే నీలి రంగు పొడి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు సమానంగా, నీటిలో సులువుగా కరిగిపోయేలా ఉంటుంది. ‘మన దేశీయ పరిశోధనలను అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులుగా మార్చడానికి బయోటెక్నాలజీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రసాయన రంగులకు ప్రత్యామ్నాయంగా నిలిచే ఇలాంటి స్వదేశీ సాంకేతికతను మేం సదా ప్రోత్సహిస్తాం’ అని టీడీబీ సెక్రటరీ రాజేష్ కుమార్ పాఠక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సాయంతో త్వరలోనే కమర్షియల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, మార్కెట్లోకి ఈ నాణ్యమైన నీలి రంగును తీసుకొస్తామని కేఎన్ బయోసైన్సెస్ యాజమాన్యం తెలిపింది.