పురిట్లోనే బిడ్డ చనిపోయిన విషయం దాచిపెట్టి.. భర్తకు చూపెట్టడానికి చిన్నారిని కిడ్నాప్ చేసింది
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:32 AM
డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె పురిట్లోనే బిడ్డ చనిపోయిన విషయాన్ని భర్తకు చెప్పకుండా దాచింది. త్వరలోనే కుమారుడితో పాటు హైదరాబాద్ వస్తానని ఆరు నెలలుగా భర్తను నమ్మించింది.
3 గంటల్లోనే కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు
హైదరాబాద్‌సిటీ/పీర్జాదిగూడ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె పురిట్లోనే బిడ్డ చనిపోయిన విషయాన్ని భర్తకు చెప్పకుండా దాచింది. త్వరలోనే కుమారుడితో పాటు హైదరాబాద్ వస్తానని ఆరు నెలలుగా భర్తను నమ్మించింది. ఇటీవల భర్తకు తెలియకుండాహైదరాబాద్ వచ్చింది. ఎక్కడైనా నెలల వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసి భర్తకు చూపించాలని పథకం వేసింది. పీర్జాదిగూడలో 8 నెలల బాబును కిడ్నాప్ చేసింది. అయితే మూడు గంటల్లోనే ఆమె పోలీసులకు పట్టుబడింది. నిందితురాలిని నల్ల దుర్గాభవాని(32)గా గుర్తించారు. ఆమె కొన్నాళ్ల కిందట డెలివరీ కోసం పుట్టింటికి ఏపీలోని భీమవరం వెళ్లింది. ఆమె భర్త హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తానే హైదరాబాద్ వస్తున్నానని, భర్తను రావొద్దంటూ కాలయాపన చేసింది. కుమారుడిని చూపించమని భర్త రోజూ ఒత్తిడి తేవడంతో ఆమె మానసిక వేదనకు గురైందని, దాంతో కిడ్నా్‌పకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాలుడిని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న భర్త వద్దకు తీసుకెళ్లి చూపించింది. మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులు కొట్టే శివరామ్, స్పందనల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తూ అనుమానితురాలి కదలికలను పసిగట్టి ఆమెను మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.