Share News

వంటవాడిగా ఇంట్లో చేరి.. రూ.కోటి నగలు కొట్టేశాడు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:05 AM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వంటమనిషిగా ఇంట్లో చేరిన ఓ వ్యక్తి.. యజమానులు ఇంట్లో లేని సమయంలో తోటి పని వారికి మత్తు మందు ఇచ్చి..

వంటవాడిగా ఇంట్లో చేరి.. రూ.కోటి నగలు కొట్టేశాడు

  • జూబ్లీహిల్స్‌లో భారీ దోపిడీ

  • యజమానులు బయటకు వెళ్లగానే.. మిగిలిన పనివారికి మత్తుమందు

  • స్పృహ కోల్పోగానే తాళ్లతో బంధనం

  • ఇద్దరు మిత్రులను పిలిపించి చోరీ

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వంటమనిషిగా ఇంట్లో చేరిన ఓ వ్యక్తి.. యజమానులు ఇంట్లో లేని సమయంలో తోటి పని వారికి మత్తు మందు ఇచ్చి.. ఆ ఇంట్లో నుంచి రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లాడు. మరో ఇద్దరి సహకారంతో గంట వ్యవధిలోనే ఈ దొంగతనం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రశర్మ అనే వ్యాపారి తన భార్య, కుమారుడు, కోడలు, మనవరాలితో కలిసి జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ప్లాట్‌ నెంబరు 62లో నివాసముంటున్నారు. మదన్‌ అనే ఏజెంట్‌ ద్వారా నేపాల్‌కు చెందిన భూపేంద్రషాహీ అలియాస్‌ భువన్‌ 15 రోజుల క్రితం ఆ ఇంట్లో వంట మనిషిగా చేరాడు. రవీంద్రశర్మ కుమారుడు గురువారం సాయంత్రం టేబుల్‌ టెన్నిస్‌ ఆడేందుకు బయటకు వెళ్లాడు. రవీంద్రశర్మ తన భార్య, కోడలు, మనవరాలు, కేర్‌ టేకర్‌ను తీసుకొని బంజారాహిల్స్‌లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అయితే, పనిలో చేరిన కొద్ది రోజులకే ఇంట్లో బంగారం ఎక్కడ ఉంచుతారో తెలుసుకున్న భూపేంద్రషాహీ.. చోరీకి ఇదే తగిన సమయమని భావించాడు. రవీంద్రశర్మ కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే తనకు సాయంగా ఇద్దరు స్నేహితులను పిలిచాడు. పుట్టిన రోజు అని చెప్పి వాచ్‌మన్‌తో పాటు పనిమనుషులైన దంపతులకు మత్తు మందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళుతుండగా తాళ్లతో కట్టేశాడు. అనంతరం స్నేహితులను ఇంట్లోకి పిలిచి రెండో అంతస్తులోని గదిలో ఉన్న అల్మారాను ధ్వంసం చేసి అందులోని నగలతో పరారయ్యాడు. మరోపక్క, గంటసేపటి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కోడలు, కేర్‌ టేకర్‌ లోపలికి వెళుతుండగా భూపేంద్రషాహీతో పాటు మరో ఇద్దరు వారిని తోసుకుంటూ బయటకు పరుగెత్తారు. వాచ్‌మన్‌ దంపతులు ఇంట్లో స్పృహ లేకుండా తాళ్లతో బంధించబడి ఉన్నారు. రవీంద్రశర్మ కోడలు భవనం రెండో అంతస్తులోని తమ గదిలోకి వెళ్లిచూడగా అక్కడి లాకర్‌లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు మాయమయ్యాయి. అనంతరం రవీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. భూపేంద్రషాహీని పనిలో పెట్టిన ఏజెంట్‌ మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పనిమనుషులుగా ఇంట్లో చేరి దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులైన నేపాలీ గ్యాంగ్‌లో నిందితులు సభ్యులని భావిస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:05 AM