బాబుకు 5 లక్షలు.. పాపకు 3 లక్షలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:41 AM
హైదరాబాద్‌లో ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా పిల్లలు లేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్న మురుగన్ ముఠాకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది.
ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా మురుగన్ ముఠా విక్రయాలు
అమ్మకం కోసం చిన్నారుల కిడ్నాప్
హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్‌వర్క్
గుజరాత్‌లో 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌తో మరోసారి తెరపైకి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా పిల్లలు లేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్న మురుగన్ ముఠాకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని దంపతులకు విక్రయించడం కోసం పేద తల్లిదండ్రుల నుంచి పిల్లలను కొనుగోలు చేయడమే కాకుండా చిన్నారులను అపహరిస్తున్నట్లు తెలంగాణ, గుజరాత్ పోలీసులు సంయుక్త దర్యాప్తులో తేలింది. కాగజ్‌నగర్‌కు చెందిన బోదాసు నాగరాజు అలియాస్ మురుగన్ గతంలో ఐవీఎఫ్ కేంద్రాలకు ఎగ్ డోనర్లను సరఫరా చేసేవాడు. అక్కడికి వచ్చే పిల్లలు లేని దంపతులతో పరిచయం పెంచుకుని, వారికి పేద తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన పిల్లలను విక్రయించేవాడు. దీనికోసం పలువురిని తన బృందంలో చేర్చుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. మలక్‌పేటకు చెందిన సోము అమూల్య, సూరారం కాలనీకి చెందిన కృష్ణవేణి, ఇస్మాయిల్‌లతో కలిసి హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. వీరితో పాటు విజయవాడలో సరోజ, గుజరాత్‌లో సునంద ఇలా పలు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. వీరి ద్వారా పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి పిల్లలను విక్రయించడానికి ఒప్పిస్తారు. అలా పిల్లలు పుట్టిన గంటల వ్యవధిలోనే తీసుకెళ్లి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తారు. అందుకోసం ముఠాలోని మరికొందరు ఐవీఎఫ్ సెంటర్ల వద్ద పిల్లలు లేని దంపతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బాబుకు రూ.5 లక్షలు, పాపకు రూ.3 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేయడంతో శిశువుల విక్రయాలు చేస్తున్న ముఠా గురించి తొలుత వెలుగులోకి వచ్చింది. నెలల వ్యవధిలోనే ఈ ముఠాపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా మరో కేసు నమోదైంది. రెండుసార్లు అరెస్టయినా తీరు మార్చుకోని ముఠా సభ్యులు తిరిగి చిన్నారుల విక్రయాలు ప్రారంభించారు. నాలుగేళ్లుగా చిన్నారుల విక్రయాలు కొనసాగిస్తున్న ముఠా.. కస్టమర్ల అవసరం కోసం కిడ్నాప్‌లకు సైతం పాల్పడుతోంది. గుజరాత్‌లో ఓ నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ కేసుతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు స్థానిక ముఠా సభ్యులను అరెస్టు చేసి దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌తో ఉన్న లింకులు బయటపడ్డాయి. తెలంగాణ పోలీసులతో కలిసి ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ముఠా మూడు రాష్ట్రాల్లో 8 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.