Share News

నెలకు 140 కోట్ల ఇంధనం ఆదా..!

ABN , Publish Date - May 14 , 2026 | 03:50 AM

పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ.. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన...

నెలకు 140 కోట్ల ఇంధనం ఆదా..!

  • హైదరాబాద్‌ ఐటీలో మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ వేస్త కలిగే ప్రయోజనమిది

  • సగం మంది ఇంటి నుంచి పనిచేసినా రోజుకు 10.8 లక్షల లీటర్ల పెట్రోల్‌ ఆదా

  • వర్క్‌ ఫ్రం హోమ్‌ వద్దంటున్న కంపెనీలు

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, మే 13(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ.. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ పిలుపు హైదరాబాద్‌ ఐటీ రంగంలో చర్చకు దారితీసింది. సాధ్యమైన చోట్ల మళ్లీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేయాలని ప్రధాని సూచించడం వెనుక ఇంధన పొదుపుతోపాటు వాహన ట్రాఫిక్‌, కాలుష్య నియంత్రణ, ఉద్యోగుల ఆరోగ్యం వంటి ప్రయోజనాలూ దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌ వంటి ఐటీ నగరానికి ఈ సూచన చాలా కీలకమని అంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ ప్రాంతాల్లో రోజూ లక్షల మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ట్రాఫిక్‌లో కష్టపడుతుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 9 లక్షల మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అధికార వర్గాల అంచనా. చాలామంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలామంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఓఆర్‌ఆర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో రోజూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

ఇంధన పొదుపు ఒక్కటే కాదు..

హైదరాబాద్‌లోని 9 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో కనీసం 4.5 లక్షల మంది వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పనిచేేస్త.. రోజుకు దాదాపు 2.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాలు తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా. ద్విచక్ర వాహనాలు సగటున లీటరుకు 35 కిలోమీటర్లు, కార్లు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని అంచనా వేసినా.. సగటున 25 కిలోమీటర్లు అవుతుంది. ఈ లెక్కన 4.5 లక్షల మంది ఒకరోజు ఇంటి నుంచి పనిచేస్తే 10.8 లక్షల లీటర్ల పెట్రోల్‌ ఆదా అవుతంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.107.5 ఉన్నందువల్ల ఇది రోజుకు సుమారు రూ.11.6 కోట్ల ఇంధన ఆదాకు సమానం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పనిచేస్తే నెలకు దాదాపు రూ.140 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తే విదేశీ మారకం ఆదాతోపాటు రూపాయి కూడా బలపడుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.


ఉద్యోగులకు శారీరక, మానసిక ఆరోగ్యం

కోవిడ్‌ సమయంలో హైదరాబాద్‌ ఐటీ కంపెనీలు రిమోట్‌ వర్క్‌ను విజయవంతంగా అమలు చేశాయి. ఇంటి నుంచే పని చేసినప్పటికీ గ్లోబల్‌ ప్రాజెక్టులు, క్లయింట్‌ సర్వీసులు, వ్యాపార కార్యకలాపాలు ఎక్కడా ఆగలేదు. దీంతో ‘కార్యాలయంలో కూర్చోవడమే ఉత్పాదకత కాదు’ అనే భావన బలపడింది. తాజాగా ఆ అంశాన్ని నాసిక్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు రాసిన లేఖలో ప్రస్తావించింది. రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణించడం వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని, ఇంధన వినియోగం, కాలుష్యం కూడా పెరుగుతున్నాయని పేర్కొంది.

హైబ్రిడ్‌ మోడల్‌కే కంపెనీల మొగ్గు

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలుచేసేందుకు హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. మళ్లీ ఇంటి నుంచి పని అంటే తాము సంక్షోభంలో పడిపోతామని చిన్న ఐటీ సంస్థలు అంటున్నాయి. మధ్య తరహా సంస్థలు మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలివ్వకుండానే ఈ చర్చ అనవసరమని పేర్కొంటున్నాయి. పెద్ద సంస్థల ప్రతినిధులు ఇప్పటికే తాము హైబ్రిడ్‌ పని విధానం అనుసరిస్తున్నామని, అదే కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రజా రవాణాను వినియోగించుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని సూచన బాగానే ఉన్నా.. అది ఎవరి ప్రయోజనాలను పణంగా పెట్టి అన్నదే ప్రశ్న అని మైండ్‌ స్పేస్‌లో ఉన్న ఒక ఐటీ సంస్థ ప్రతినిధి ప్రశ్నించారు. కోవిడ్‌ తర్వాత ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించి, కార్యకలాపాలను గాడిలో పెట్టడానికి మూడునాలుగేళ్లు పట్టిందని, మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే తట్టుకోవడం కష్టమని మరో సంస్థ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే హైబ్రిడ్‌ మోడల్‌ నడుస్తోందని, కావాలనుకున్నవారు దానిని వాడుకుంటున్నారని ఒక ఐటీ సంస్థలో హెచ్‌ఆర్‌ బృంద సభ్యుడైన రామ్‌ తెలిపారు.

వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఉత్పత్తిని పెంచగలం

నేను 9 ఏళ్లుగా ఐటీ రంగంలో పని చేస్తున్నాను. మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ అమలైతే 2 నుంచి 3 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రయాణ హడావిడి, వాయు, శబ్ద కాలుష్యం వల్ల కలిగే చికాకు లేకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల మరింత ఏకాగ్రతతో పనిచేసి ఉత్పత్తిని పెంచగలం. బయటి ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. స్వస్థలాలకు వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుంది. దీంతో జీవన వ్యయం తగ్గి పొదుపు పెంచుకోవచ్చు.

- వెంకటేశ్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, ఎల్‌్క్షటీ మైండ్‌ ట్రీ

Updated Date - May 14 , 2026 | 03:50 AM