ఇంత బంగారం ఎలా కొన్నావ్ చెప్పు?
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:35 AM
చూసినోళ్లు ఆశ్చర్యపోయేలా బంగారు ఆభరణాలు ధరించి టీవీలు, సోషల్ మీడియాలో హడావుడి చేస్తోన్న ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు షాకిచ్చారు.
గోల్డ్‌మ్యాన్ యాదగిరికి ఐటీ శాఖ నోటీసులు
900 గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్
రాయదుర్గం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): చూసినోళ్లు ఆశ్చర్యపోయేలా బంగారు ఆభరణాలు ధరించి టీవీలు, సోషల్ మీడియాలో హడావుడి చేస్తోన్న ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు షాకిచ్చారు. అతని వద్ద సుమారు 900 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసి.. ఆ బంగారానికి లెక్కలు చెప్పమంటూ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతానికి చెందిన గోల్డ్‌మ్యాన్ యాదగిరి అలియాస్ చిన్న పహిల్వాన్ అలియాస్ చిన్న గౌడ్.. బంగారు ఆభరణాలు ధరించి ఇటీవల టీవీలు, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న గౌడ్‌పై ఐటీ అధికారులు దృష్టి సారించారు. అతని వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకొని, ఆ బంగారం కొనుగోలుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. చిన్నగౌడ్ ఐటీ శాఖ అధికారులకు తన ఆదాయం రూ.4లక్షలుగా చూపించడం గమనార్హం. అయితే, అధికారులు సీజ్ చేసిన కొంత బంగారానికి తన వద్ద రశీదులు ఉన్నాయని, మరికొంత బంగారం తమ పెద్దల నుంచి వచ్చిందని చిన్నగౌడ్ చెబుతున్నారు. ఐటీ అధికారులు అడిగిన ఆధారాలు సమర్పిస్తానని పేర్కొన్నారు.