ఎవరెస్ట్‌పైనే హైదరాబాదీ మృతదేహం!
ABN , Publish Date - May 28 , 2026 | 04:01 AM
ఆయనో పర్వతారోహకుడు.. ఇప్పటికే ఎన్నో పర్వత శిఖరాలను అధిరోహించారు.. ఎవరెస్ట్ పైకి చేరాలన్నది కల.. ఇంతకుముందు ఓసారి ప్రయత్నించినా కుదరలేదు..
శిఖరాన్ని అధిరోహించి తిరిగొస్తూ ఐటీ ఉద్యోగి అరుణ్ తివారీ మృతి
మృతదేహాన్ని తీసుకురావడం కష్టం..
ఆధ్యాత్మిక నమ్మకంతో ఎవరెస్ట్‌పైనే ఉంచేయాలని కుటుంబసభ్యుల నిర్ణయం
హైదరాబాద్ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆయనో పర్వతారోహకుడు.. ఇప్పటికే ఎన్నో పర్వత శిఖరాలను అధిరోహించారు.. ఎవరెస్ట్ పైకి చేరాలన్నది కల.. ఇంతకుముందు ఓసారి ప్రయత్నించినా కుదరలేదు.. ఈసారి విజయవంతంగా ఎవరెస్ట్‌ను అధిరోహించారు.. ఆ ఆనందంలో తిరిగివస్తూ శిఖరానికి కాస్త దిగువన కన్నుమూశారు.. పర్వతారోహణపై ఆయనకున్న మమకారం.. శివుడికి నిలయమైన హిమాలయాల్లో కన్నుమూశారన్న ఆధ్యాత్మిక నమ్మకంతో.. ఆయన మృతదేహాన్ని ఎవరెస్ట్ శిఖరంపైనే ఉంచేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వారం రోజుల క్రితం ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ముగ్గురు పర్వతారోహకులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో హైదరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల అరుణ్‌కుమార్ తివారీ, భారత సంతతి అమెరికన్ సందీప్ ఆరె కన్నుమూశారు. మరో హైదరాబాదీ ప్రాణాలతో బయటపడ్డారు. ఐటీ ఉద్యోగి అయిన అరుణ్ తివారీ ఇప్పటికే కిలిమంజారో, ఎల్బ్రస్, డెనాలీ, అకాన్‌కగువా, రుదుగైరా, కాంగ్ యాట్సీ తదితర పర్వత శిఖరాలను అధిరోహించారు. ఎవరెస్ట్ అధిరోహణ ఆయన లక్ష్యం. గత ఏడాది ప్రయత్నించినా.. 7,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లాక అనారోగ్య కారణాలతో వెనక్కి వచ్చేశారు. ఇటీవల విజయవంతంగా శిఖరాన్ని అధిరోహించారు. దిగివచ్చే క్రమంలో 8,790 మీటర్ల ఎత్తులో హిల్లరీ స్టెప్ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అత్యంత ప్రమాదకర ప్రాంతం..
ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండి, క్షణక్షణానికి వాతావరణం మారిపోయే ప్రమాదకర ప్రాంతం హిల్లరీ స్టెప్. అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకురావడం తీవ్ర శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సాహసయాత్ర నిర్వాహక సంస్థ పయనీర్ అడ్వెంచర్స్.. 94 వేల డాలర్లు (సుమారు రూ.89 లక్షలు) అడిగింది. ఇందుకు వారం, పది రోజులకు పైగా సమయం అవసరం, మృతదేహాన్ని తెచ్చేందుకు వెళ్లేవారి ప్రాణాలకూ ప్రమాదమే. దీనితోపాటు పరమశివుడి నివాసమైన హిమాలయాల్లో అరుణ్ తివారీ శరీరాన్ని ఉంచేయాలని నిర్ణయించుకున్నామని ఆయన బావమరిది సుధీర్ ఉపాధ్యాయ వెల్లడించారు.